నిజామాబాద్, వెలుగు: జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు ఖాతాలు(మ్యూల్ అకౌంట్లు) తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఖాతాల ద్వారా గత మూడు నెలల్లో రూ.152 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు. నకిలీ పత్రాలతో జిల్లాలోని కర్నాటక బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరిచి వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠా గురించి సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ముఠాకు చెందిన పలువురిని పట్టుకుని విచారించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో బోధన్‌కు చెందిన మహ్మద్ అర్బాజ్, భానుప్రసాద్, బొగుడుమీది వీరేశం, అబ్దుల్ వసీం, షేక్ సమీర్, నిజామాబాద్ నగరానికి చెందిన మహ్మద్ సమీర్, మహ్మద్ జమీల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ రహీంలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా రెంజల్ మండలానికి చెందిన షేక్ ఇఫ్తెకార్, సబావత్ అశోక్, ఎడపల్లికి చెందిన షేక్ షోయబ్‌ల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడంలో దరఖాస్తుదారులు సమర్పించే ఆధార్, చిరునామా, ఉద్యోగ వివరాలను బ్యాంకర్లు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేయాలని సీపీ సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
