సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..  నాసిక్ కరెన్సీ నోట్ల ముద్రణాలయంలో కొత్త డిజైన్‌తో 37 కోట్ల 54 లక్షల 50 వేల కోట్ల రూ.5వందల నోట్లు ముద్రితమయ్యాయని, వీటిలో 34 కోట్ల 50 లక్షల నోట్లు మాత్రమే ఉన్నాయి. 2015 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో ఈ నోట్లు ఆర్బీఐకి ఈ ముద్రణాలయం నుంచి చేరాయని వార్తలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఓ తాజాగా స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలని కరాఖండీగా చెప్పేసింది.

ఆర్టీఐ ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా చూపించారని, ఈ రిపోర్ట్ పూర్తిగా అబద్దం అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ముద్రణాలయాల నుంచి ఆర్బీఐకి సరఫరా అయిన అన్ని బ్యాంక్‌నోట్లు సరైన విధంగా లెక్కల్లోకి వచ్చాయని తెలిపింది. ముద్రణాలయాల నుంచి ఆర్టీఐ చట్టం, 2005 ప్రకారం సేకరించిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వివరించారని తెలిపింది. బ్యాంక్‌నోట్ల లెక్కలు సక్రమంగా ఉండేలా చేసే పటిష్ట వ్యవస్థ ఆర్బీఐకి ఉందని, ముద్రణాలయాల్లో బ్యాంక్‌నోట్ల ముద్రణ, నిల్వ, వాటిని ఆర్బీఐకి సరఫరా చేయడం వంటివాటికి సంబంధించిన కఠినమైన నిబంధనలు, విధానాలు అమల్లో ఉన్నాయని వివరించింది. ఆర్బీఐ ఎప్పటికప్పుడు వెల్లడించే సమాచారాన్ని ప్రజలు విశ్వసించాలని కోరింది.

ఆర్టీఐకి పిటిషన్ వేసింది ఎవరంటే..

మనోరంజన్‌ రాయ్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈ విషయంపై దరఖాస్తు చేసుకోగా.. ఆర్బీఐ సమాచారం ఇచ్చింది. బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌ దేవస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో రూ.500 కరెన్సీ ముద్రించబడతాయి. 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు జరగ్గా.. అంతకు ముందు నుంచే నాసిక్‌ ప్రెస్‌లో కొత్త రూ.500 నోట్ల ముద్రణ జరిగింది. "2015 ఏప్రిల్‌–2016 డిసెంబరు మధ్యకాలంలో ఈ ప్రెస్‌లో ముద్రితమైన నోట్లకు, ఆర్బీఐకి చేరిన నోట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం బయటపడిందని రాయ్‌ వివరించారు. 2015 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబరు వరకు నాసిక్‌ ప్రెస్‌లో 37.54 కోట్ల మేర రూ. 500 నోట్లు ప్రింట్‌ అయ్యాయి. వాటిల్లో 34.5 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి. ఈ స్థాయిలో నోట్లు అదృశ్యం కావడమనేది మామూలు విషయం కాదు. అది దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం" అని ఆయన అన్నారు.

భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే మూడు యూనిట్లు ఉన్నాయి. వాటిలో బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ మరియు మధ్యప్రదేశ్‌లోని  దేవాస్ బ్యాంక్ నోట్ ప్రెస్ ఉన్నాయి.