గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి.. మేడారం తరహాలో గద్దెల నిర్మాణం

గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి..  మేడారం తరహాలో గద్దెల నిర్మాణం
  • గోదావరిఖనిలో రూ.6  కోట్లతో అభివృద్ధి పనులు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో గోదావరి నది ఒడ్డున జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 28 నుంచి నాలుగు రోజులపాటు జాతర జరగనుండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సింగరేణి, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, జాతర కమిటీ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులు మేడారం జాతరకు వెళ్తే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగొద్దని 1992 నుంచి ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి సంస్థ గోదావరి ఒడ్డున జాతర నిర్వహిస్తోంది. ప్రస్తుతం జరగనున్న జాతరకు రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ సహకారంతో దాదాపు రూ.6 కోట్లు వెచ్చించి శాశ్వత ప్రాతిపదికన అవసరమైన పనులన్ని పూర్తి చేస్తున్నారు. 

మేడారం తరహాలో నాలుగు గద్దెల నిర్మాణం

మేడారం జాతర మాస్టర్​ప్లాన్​ ప్రకారం నది ఒడ్డున కూడా ఒకే వరుసలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలను నిర్మించారు. వాటికి పక్కన లక్ష్మీదేవి, నాగులమ్మ గద్దెలను చిన్నగా ఏర్పాటు చేశారు. భక్తులు గద్దెల మీదకు వెళ్లకుండా ప్రత్యేకంగా గ్రిల్స్​ నిర్మించారు. దాదాపుగా 10 ఫీట్ల ఎత్తులో అమ్మవార్ల గద్దెలను నిర్మించి గ్రానైట్​ పరుస్తున్నారు. కొత్తగా చెక్కతో సమ్మక్క, సారలమ్మ విగ్రహాలను తయారు చేయించారు. జాతర జరిగే ప్రాంతం మొత్తం షాబాద్​ బండతో ప్లోరింగ్​ చేశారు. ఎండోమెంట్​ సహకారంతో జాతర స్థలానికి ముందు భాగంలో గోపురం మోడల్​లో 150 ఫీట్ల పొడువుతో సాలారం నిర్మించారు. 

జాతర జరిగే సమయంలో భక్తుల రాక ఎక్కువైతే తొక్కిసలాట జరగకుండా క్యూలైన్లలో ఉన్న వారిని దర్శనానికి పంపేలా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేశారు. జాతర చుట్టూ మూడు వైపులా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. భక్తులకు భోజన సౌకర్యం కోసం జాతర వెనక స్థలంలో 30 మీటర్ల పొడవుతో కిచెన్​ షెడ్డు, ముందు వైపు ఓపెన్​ షెడ్​ నిర్మించారు. లైటింగ్​ కోసం ఐదు టవర్ల ద్వారా హైమాస్ట్​ లైట్లు, 16 సాధారణ ఫోల్స్​ ద్వారా స్ట్రీట్​ లైట్లను బిగించారు. నది ఒడ్డున శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.