న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో అతిపెద్ద డెయిరీ సంస్థలైన అమూల్, మదర్ డెయిరీ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుపై రూ.2 నుంచి రూ.6 వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. అత్యధికంగా 6.5 శాతం ఫ్యాట్ ఉండే ఫుల్ క్రీమ్ గేదె పాలపై అమూల్ సంస్థ లీటరుకు ఏకంగా రూ.6 వరకు పెంచింది. దీంతో గతంలో రూ.80 ఉన్న లీటర్ గేదె పాల ధర ఇప్పుడు రూ.86కు చేరింది. సాధారణ ఫుల్ క్రీమ్ పాలపై లీటరుకు రూ.4 పెంచగా.. టోన్డ్ మిల్క్ ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది.
మరోవైపు, మదర్ డెయిరీ కూడా ఢిల్లీ-– ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. బల్క్ వెండింగ్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.58 నుంచి రూ.60కి పెరిగింది. ప్యాక్డ్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ.72 నుంచి రూ.76కు చేరింది. ప్యాక్డ్ టోన్డ్ పాలు రూ.60 నుంచి రూ.62కి, డబుల్ టోన్డ్ పాలు రూ.54 నుంచి రూ.56కు, ఆవు పాలు లీటరుకు రూ.62 నుంచి రూ.65కి పెరిగాయి. ఒక్క ఢిల్లీ–-ఎన్సీఆర్లోనే మదర్ డెయిరీ రోజూ 50 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తోంది.
దాణా ధరలు పెరగడం వల్లే..
సాధారణంగా శీతాకాలంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండి సరఫరా పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డెయిరీ రంగంలో సరఫరా కొరత కనిపిస్తోంది. పశువుల దాణా ధరలు పెరగడంతో రైతులకు పోషణ ఖర్చులు పెరిగాయి. దీంతో ఏర్పడిన పాల కొరత వల్ల గత కొద్ది నెలల్లో మిల్క్ ఫ్యాట్ ధరలు 20 శాతం నుంచి 25 శాతం వరకు ఎగబాకాయి. రైతులకు గిట్టుబాటు కల్పించి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అమూల్ ఫ్యాట్ సేకరణ ధరను కిలోకు రూ.1,000కి పెంచింది. దీనివల్ల రైతులకు లీటరుకు రూ.60పైగా ఆదాయం అందుతోంది. అయితే కంపెనీలకు పాల సేకరణ ఖర్చులు గణనీయంగా పెరగడంతో డెయిరీ సంస్థలు ధరలు పెంచాయి.
