తగ్గని సన్నబియ్యం రేట్లు..సర్కారు ఆదేశాలు పట్టించుకోని వ్యాపారులు!  

తగ్గని సన్నబియ్యం రేట్లు..సర్కారు ఆదేశాలు పట్టించుకోని వ్యాపారులు!  
  • రూ.66 నుంచి రూ.79 వరకే విక్రయించాలని సివిల్ సప్లయ్స్ శాఖ ఆదేశాలు 
  • మార్కెట్లలో మాత్రం కిలో రూ.90 నుంచి రూ.95 వరకు అమ్మకాలు 
  • ధరల నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసినా మారని తీరు 
  • అడ్డగోలు ధరలతో సామాన్యులపై అదనపు భారం 

హైదరాబాద్, వెలుగు: సన్నబియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం గరిష్ట చిల్లర ధరలను నిర్ణయించినా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యాపారుల తీరు మారడం లేదు. సివిల్ సప్లయ్స్ శాఖ కిలో బియ్యం ధర రూ.66 నుంచి రూ.79 మధ్యే ఉండాలని ఆదేశించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మార్కెట్లలో పాత ధరలకే అమ్మకాలు కొనసాగుతున్నాయి.

సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో రూ.95, మీడియం రకం రూ.90 వరకు విక్రయిస్తుండగా, ఫైన్ రకం ధర కూడా రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఇటీవల సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా సూపర్ ఫైన్ రకాల ధర కిలోకు రూ.95 వరకు చేరింది.

దీనిపై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాపారులు, మిల్లర్లు, అధికారులతో సమావేశమై మార్కెట్ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం బియ్యం రకాలను బట్టి గరిష్ట చిల్లర ధరలను నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. అయినా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ధరలు తగ్గడం లేదు.

రకాలను బట్టి ధరల నిర్ణయం.. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీపీటీ, కేఎన్‌‌‌‌‌‌‌‌ఎం రకాల బియ్యం కిలో గరిష్ట ధర రూ.66గా నిర్ణయించారు. తెలంగాణ సోనా (ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్) రకానికి రూ.74, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంటీ, జై శ్రీరాం రకాల బియ్యానికి రూ.79గా ఖరారు చేశారు. ఈ ధరలకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులు, మిల్లర్లను హెచ్చరించారు. అయినప్పటికీ రిటైల్ మార్కెట్లలో అధిక ధరలకే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను వ్యాపారులు బేఖాతరు చేస్తుండడంతో సామాన్యులపై భారంపడి ఆందోళనకు గురవుతున్నారు.

తనిఖీలు చేస్తున్నా.. తగ్గని ధరలు.. 

ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. అధిక ధరలకు విక్రయాలు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సివిల్ సప్లయ్స్, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్, పోలీస్, జీఎస్టీ, తూనికలు-కొలతల శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని హోల్‌‌‌‌‌‌‌‌సేల్, రిటైల్ మార్కెట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. బేగంబజార్, నాంపల్లి, మహరాజ్‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌లోనూ తనిఖీలు చేపట్టారు. అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు. అయినా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ధరలు తగ్గకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఆదేశాలు అమలయ్యేదెప్పుడు?

ప్రభుత్వం ధరలు నిర్ణయించడం, వ్యాపారులను హెచ్చరించడానికే పరిమితమవుతోందని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల వారీగా ధరలను పరిశీలించి, అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్ణయించిన గరిష్ట ధరలను ప్రతి దుకాణంలో కనిపించేలా ప్రదర్శించాలని సూచిస్తున్నారు. బియ్యం నిత్యావసర వస్తువు కావడంతో ధరల పెరుగుదల ప్రతి కుటుంబ బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు