- స్టేట్‌లో శిథిలావస్థలో 9,707 క్లాస్ రూములు
- మరో 12,887 తరగతిగదుల రిపేర్లకు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో శిథిలావస్థకు చేరిన క్లాసు రూములను నేలమట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షం వస్తే కారుతూ, పెచ్చులు ఊడి నెత్తిమీద పడుతూ పిల్లలకు ప్రమాదకరంగా మారిన తరగతి గదులను వెంటనే కూల్చివేయాలని తాజాగా జిల్లా కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. భారీ రిపేర్లకు అవసరమైన 9,707 క్లాసు రూములే వీటిలో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. ప్రమాదకరంగా మారిన గదుల్లో విద్యార్థులను కూర్చోబెట్టవద్దని, విపత్తు నిర్వహణ విభాగం, ఇంజినీరింగ్ అధికారుల సమన్వయంతో ప్రమాదాలు జరగకముందే వాటిని పడగొట్టాలని స్పష్టం చేసింది. తాజాగా జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ సీఎస్ సంజయ్ జాజు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. యూడైస్ ప్లస్ 2025–26 తాజా నివేదిక ఆధారంగా విద్యాశాఖ ఈ చర్యలు ప్రారంభించింది.
మైనర్ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలి
శిథిలావస్థకు చేరిన క్లాసురూములతో పాటు మరోవైపు పాక్షికంగా దెబ్బతిన్న 12,887 తరగతి గదులకు మైనర్ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీటికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే కూల్చివేయాల్సిన భవనాలు అత్యధికంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. భారీ రిపేర్లకు అవసరమైన క్లాసులు రూములు సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 776 గదులు ఉన్నాయి. రంగారెడ్డిలో 648, నిజామాబాద్‌లో 602, వికారాబాద్‌లో 572, నల్లగొండలో 495, కామారెడ్డిలో 450 గదులను పడగొట్టాల్సి ఉన్నట్టు సమాచారం. మరోపక్క రిపేర్లు చేయాల్సిన 12,887 గదుల్లోనూ రంగారెడ్డి (1,041), సంగారెడ్డి (928), వికారాబాద్ (810) మొదటి వరుసలో ఉన్నాయి.
417 బడులకు కరెంటే లేదు..
స్టేట్‌లో ఇప్పటికీ 417 సర్కారు స్కూళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా గాలికొదిలేశారు. అత్యధికంగా నల్లగొండలో 54, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 52, మహబూబాబాద్‌లో 44, నిర్మల్‌లో 32 బడుల్లో ఈ సమస్య ఉంది. ఆదిలాబాద్, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో 17న చొప్పున స్కూళ్లలో
కరెంట్ ఇష్యూ ఉంది.
169 బడుల్లో నీళ్లు లేవ్
రాష్ట్రంలో 169 బడుల్లో శాశ్వత తాగునీటి సౌకర్యమే లేదని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఏకంగా 54 బడుల్లో ఈ సమస్య ఉంది. రంగారెడ్డిలో 10, మహబూబాబాద్‌లో 9, సూర్యాపేటలో 8, నిర్మల్, జగిత్యాల, మేడ్చల్ జిల్లాల్లో 7 చొప్పున స్కూళ్లలో వాటర్ సమస్య ఉంది.
