- ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నా... ఎందుకీ వైఫల్యం?: బండి సంజయ్
- ఇకనైనా భేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనాలని సూచన
కరీంనగర్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లకు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగావడం లేదని ఆయన మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే 'రైతు గోస బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
రూ.1.39 కోట్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం రెండో అంతస్తు నిర్మాణానికి బండి సంజయ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్దరణ, షెడ్ల మరమ్మతు పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుతిలీతాడు మొదలుకొని రవాణా ఖర్చుల వరకు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని స్పష్టం చేశారు. ఇకనైనా భేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.
