ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సిమెంట్ పరిశ్రమ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా నేలమట్టమవుతున్నాయి. ప్లాంట్ మూతపడిన తర్వాత, తాజాగా పరిశ్రమకు చెందిన నిర్మాణాల కూల్చివేత పనులు జోరందుకున్నాయి.
ఇందులో భాగంగా.. పరిశ్రమకు గుండెకాయ లాంటి భారీ ప్యాకింగ్ ప్లాంట్‌ను కాంట్రాక్టర్ కూల్చివేశారు. సుమారు వంద అడుగుల ఎత్తున్న ఈ ప్యాకింగ్ ప్లాంట్ భవనాన్ని నేలమట్టం చేశారు. ప్రోక్లైన్ల సహాయంతో భవనానికి పిల్లర్లుగా ఉన్న పునాదులను తొలగించడంతో.. ఆ భారీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంద అడుగుల ఎత్తైన ప్లాంట్ క్షణాల వ్యవధిలో నేలమట్టమైంది.
గత నెల రోజులుగా ఈ సీసీఐ పరిశ్రమ పరిధిలో కూల్చివేత పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కూల్చివేత పనుల టెండర్‌ను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. దీంతో ప్లాంట్‌లోని పాత యంత్రాలు, భారీ స్క్రాప్, భవనాలను పూర్తిగా తొలగించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒకప్పటి ఉపాధి నిలయం.. ఇలా కళ్లముందే శిథిలాల కుప్పగా మారుతుండటం స్థానికులను కలచివేస్తోంది.
