ఐపీఎల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. వేసవి క్రికెట్ పండగ ఇక ఉండదా..?

ఐపీఎల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. వేసవి క్రికెట్ పండగ ఇక ఉండదా..?

సమ్మర్ అనగానే క్రికెట్ ప్రియులకు మొదటగా గుర్తుకు వచ్చేది ఐపీఎల్. సమ్మర్‎లో రెండు నెలల పాటు ఐపీఎల్‎ను తెగా ఎంజాయ్ చేస్తారు క్రికెట్ అభిమానులు. అయితే, ఎండకాలంలో క్రికెట్ లవర్స్‏ను ఉర్రూతలూగించే ఐపీఎల్ విండోను బీసీసీఐ మార్చబోతుందా..? ఇకపై వేసవి క్రికెట్ పండగ ఉండదా..? అంటే కొన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. 

టోర్నీ షెడ్యూల్ మార్పుపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ స్పోర్ట్స్ న్యూస్ ఛానల్ స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ మాట్లాడుతూ.. వేసవిలో అధిక వేడి, ఆటగాళ్ల అలసటపై ఆందోళనల కారణంగా ఐపీఎల్ టోర్నీ విండోను మార్చి-మే నుంచి సెప్టెంబర్-అక్టోబర్‌కు మార్చడాన్ని బీసీసీఐ పరిశీలించవచ్చని అన్నారు. 

అయితే, ప్రస్తుత విండోను మార్చడానికి తక్షణ అవసరం ఏమీ లేదని.. విండో మార్పు నిర్ణయాన్ని లీగ్ ప్రసార భాగస్వామితో సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని.. వాణిజ్య, నిర్వహణాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టోర్నమెంట్ సమయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందన్నారు.

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సాంప్రదాయకంగా ఏప్రిల్, మే రెండు నెలల వ్యవధిలో జరుగుతూ వస్తోంది. అయితే, 2028 నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశాన్ని కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిశీలిస్తుండటంతో, షెడ్యూలింగ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం.. ఐపీఎల్‌లో రెండు నెలల వ్యవధిలో 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు జరుగుతాయి.