దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించడానికి.. అంతకంటే మరీ ముఖ్యంగా ముడి చమురు దిగుమతులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ ప్రస్తుతం పాత వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. 2022 కంటే ముందు కొన్న టూవీలర్లు, ఫోర్‌వీలర్ల యజమానుల్లో దాదాపు సగం మంది E20 పెట్రోల్ వాడకం వల్ల తమ వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోయిందని వాపోతున్నారు. 'లోకల్‌సర్కిల్స్' దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ కంపెనీలన్నీ తప్పనిసరిగా 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ఉన్న ఇంధనాన్ని మాత్రమే విక్రయిస్తుండటంతో వాహనదారులు వేరే దారి లేక దీన్నే వాడుతున్నారు. అయితే అధికారిక అంచనాల ప్రకారం ఈ20 పెట్రోల్ వల్ల మైలేజ్ కేవలం 1 నుండి 6 శాతం మాత్రమే తగ్గుతుందని చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో వాహనదారుల వాస్తవ అనుభవం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరిలో ఒకరు మైలేజ్ భారీగా తగ్గిందని చెప్పారు. అందులోనూ 25 శాతం మంది తమ వాహనాల మైలేజ్ ఏకంగా 20 శాతం కంటే ఎక్కువ పడిపోయిందని, మరో 20 శాతం మంది 10 నుండి 20 శాతం వరకు మైలేజ్ తగ్గిందని చెప్పుకొచ్చారు.
మైలేజ్ తగ్గడం ఒక ఎత్తయితే.. వాహనాల ఇంజన్లు దెబ్బతినడం మరో ఎత్తు. దాదాపు 29 శాతం మంది వాహనదారులు తమ బండ్లకు తరచూ రిపేర్లకు వస్తున్నాయని.. ఇంజన్, ఫ్యూయల్ లైన్, ట్యాంక్ లేదా కార్బ్యురేటర్లలో వింత మార్పులు గమనించామని చెప్తున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే త్వరగా తేమను ఆకర్షిస్తుంది. దీనివల్ల పాత వాహనాల్లోని రబ్బర్, ప్లాస్టిక్ భాగాలు, సీల్స్, గ్యాస్కెట్లు త్వరగా పాడైపోతున్నాయి. బండి ఇంజన్ త్వరగా వేడెక్కడం, వైబ్రేషన్స్ రావడం, ఉదయం పూట స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పెట్టడం, పికప్ దారుణంగా పడిపోవటం లాంటి సమస్యలను టూవీలర్ల యజమానులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారట.
ALSO READ : పూణే పోర్షే కేసులో బెయిల్
నిజానికి గత 15 ఏళ్లలో అమ్ముడైన వాహనాల్లో దాదాపు 80 శాతం కేవలం E5, E10 పెట్రోల్‌కు మాత్రమే తగినట్లుగా డిజైన్ చేయబడ్డాయి. ఇప్పుడు అకస్మాత్తుగా E20 ఫ్యూయల్ వాడటం వల్ల వాటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాత బండ్లు ఉన్న సాధారణ ప్రజలకు తక్కువ ఇథనాల్ ఉన్న ప్రీమియం పెట్రోల్ కొందామన్నా.. దాని ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. ఒకవైపు E20 పెట్రోల్‌తోనే వాహనదారులు ఇలా సగం చస్తుంటే.. ప్రభుత్వం మాత్రం రాబోయే రోజుల్లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచి E22, E25, E30 పెట్రోల్ తీసుకురావడానికి సిద్ధమవడం వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
