మనీ పవర్, పలుకుబడి ఉంటే చాలు.. ఎంత పెద్ద నేరం చేసినా సెలబ్రేట్ చేసుకోవచ్చనేలా సమాజానికి అత్యంత దారుణమైన సందేశాన్ని ఇచ్చింది పూణే పోర్షే కార్ యాక్సిడెంట్ నిందితుడి ఫ్యామిలీ. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పూణే పోర్షే కేసు గుర్తుంది కదా? 2024 మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఒక మైనర్ బాలుడు ఫుల్లుగా తాగి, విపరీతమైన వేగంతో పోర్షే కారు నడుపుతూ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోస్టాలను ఢీకొట్టాడు.
ఆ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కన్నబిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతుంటే.. ఈ కేసులో ప్రధాన నిందితుడి తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆ కుటుంబం జరిపిన వేడుకలు చూసి దేశం ముక్కున వేలేసుకుంటోంది.
पुण्यामध्ये porsche कार मधल्या आरोपीचे वडील विशाल अग्रवाल , ज्यांच्या मुलाने रॅश ड्रायव्हिंग मध्ये एक युवक युवती चा बळी घेतला होता त्या केस मध्ये जेलमधून सुटल्यानंतर जसं काही खूप मोठं चांगलं काम करून आलेत त्याची पार्टी करतातनाचत आहेत तुम्ही एक युवती आणि एका युवकाचा बळी घेतला आहे. pic.twitter.com/pVoJonraqt
— Sangeeta Tiwari Inc (@Sangeeta_INC) May 27, 2026
సుమారు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు మార్చి 10న విశాల్ అగర్వాల్‌కు బెయిల్ ఇచ్చింది. కోర్టు కేవలం బెయిల్ ఇస్తూ సాక్షులను సంప్రదించవద్దని ఆదేశిస్తే.. ఆ అగర్వాల్ కుటుంబం మాత్రం ఒక లోకల్ రెస్టారెంట్‌లో లైవ్ బ్యాండ్ పెట్టి మరీ పండుగ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వైరల్ వీడియోలో.. 1977 నాటి ప్రసిద్ధ బాలీవుడ్ సాంగ్ “బంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలాం కరో” అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే.. జైలు నుండి వచ్చిన విశాల్ అగర్వాల్ తన భార్య, కొడుకుతో కలిసి సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అంతటితో ఆగకుండా విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ పూల దండలతో పాటు, కరెన్సీ నోట్లతో చేసిన భారీ దండలు కూడా వేశారు. కస్టమర్లు, బంధువులు చప్పట్లు కొడుతుంటే కొడుకు తన తండ్రిని గాల్లోకి ఎత్తడం, మరోవైపు భార్య కూడా మెడలో కరెన్సీ నోట్ల దండ వేసుకుని చిందులు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ALSO READ : రైడ్ కోసం వచ్చిన.. ఈడీ అధికారుల కార్లపై రాళ్ల దాడి..
నిజానికి ఈ తల్లిదండ్రులే కదా తమ కొడుకుని కాపాడటానికి యాక్సిడెంట్ జరిగిన వెంటనే బ్లడ్ శాంపిల్స్ మార్చడానికి ప్రయత్నించింది? కొడుకు తాగి లేడని నిరూపించడానికి డాక్టర్లను మేనేజ్ చేసి, చివరికి తమ కార్ డ్రైవర్‌ను బెదిరించి నేరం ఒప్పుకోమన్న కేసులో వీరు అరెస్ట్ అయ్యారు. ఇంతటి క్రిమినల్ మైండ్ ఉన్న కుటుంబం.. బెయిల్ రాగానే ఇలా కరెన్సీ నోట్లతో వేడుకలు చేసుకోవడం చట్టాన్ని, సమాజాన్ని అవహేళన చేయడమేనని జనాలు మండిపడుతున్నారు. చనిపోయిన ఆ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలకు వీరు ఇస్తున్న విలువ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అగర్వాల్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడాల్సింది పోయి, ఇలా వికృత చేష్టలతో వేడుకలు చేసుకోవడం వారి అహంకారానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
