
పద్మారావునగర్, వెలుగు : మతానికి మానవత్వం జోడిస్తే లోకకల్యాణం సాధ్యమవుతుందని మంత్రి సీతక్క చెప్పారు. ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశాన్ని గురువారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. మతాలు వేరైనా, దేవుళ్లు వేరైనా, ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయన్నారు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం మానుకోవాలని సూచించారు. ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ.. సాటి మనిషిని ప్రేమించాలని చెప్పారు.
మానవత్వంతో కూడిన మతాన్నే ప్రజలకు ఇష్టపడుతారన్నారు. మత ప్రచారానికే పరిమితం కాకుండా.. మానవసేవే మాధవసేవ అన్న సూత్రాన్ని అందరూ పాటించాలని సూచించారు. మంచి ఉద్దేశంతో పాస్టర్లు మీటింగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం మంత్రి సీతక్కను శాలువాతో సన్మానించారు.