సూర్యాపేట, వెలుగు: తుంగతుర్తి కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పాత, కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలోని అర్వపల్లి మండలంలో మండల, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులను ఎన్నుకునేందుకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఫొటో చిన్నదిగా ఉందంటూ ఆయన వర్గీయులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సామేల్ వర్గానికి, పాత కాంగ్రెస్ వర్గానికి మధ్య తోపులాట జరగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు కుర్చీలను గాల్లోకి విసరడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సూర్యాపేట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని కార్యకర్తలతో మాట్లాడి వెనక్కి పంపించారు. విషయం తెలుసుకున్న పీసీసీ పరిశీలకులు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సమావేశానికి రాకుండానే మీటింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మీటింగ్కు సహ పరిశీలకులు చత్రునాయక్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ గొడవ జరగడంతో రాలేదు.
2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకే పదవులు వస్తాయని తెలిసి ఎమ్మెల్యే వర్గీయులు దాడులకు దిగి సమావేశం రద్దయ్యేలా ప్లాన్ చేశారని పాత కాంగ్రెస్ వర్గం నేతలు ఆరోపించారు. సభకు అంతరాయం కలిగించిన వ్యక్తులపై శనివారం వరకు చర్యలు తీసుకోకపోతే, ఆదివారం గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగుతామని సీనియర్ కార్యకర్తలు హెచ్చరించారు.
