బీఆర్​ఎస్​ లో లుకలుకలు: ఒకే ఒరలో ఇమడని కత్తులు.. కీలక నాయకుల మధ్య ఆధిపత్య పోరు?

 బీఆర్​ఎస్​ లో లుకలుకలు: ఒకే ఒరలో ఇమడని కత్తులు.. కీలక నాయకుల మధ్య ఆధిపత్య పోరు?

మంచికో, చెడుకో ఒక రాజకీయ పార్టీ నిరంతరం మీడియాలో ఉండాలంటారు. బీఆర్‌ఎస్‌లో లుకలుకలున్నాయని, ఆ పార్టీలో కీలక నాయకులు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని మీడియాలో వస్తున్న కథనాలు మంచికా? చెడుకా? అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఈలోపు సదరు ముఖ్యనాయకుల ఖండనలు సరేసరి!  ఇంతకీ పార్టీలో ఏం జరుగుతోందనే విషయంలో స్పష్టత లేకపోయినా, ‘నివురుగప్పిన నిప్పులా’ లోలోన ఏదో జరుగుతోందనేది వాస్తవం. 

పార్టీ అధినేత కేసీఆర్‌ తనయ కవిత  క్రియాశీలత పెంచి మరింత ‘జాగృతం’ కావడాన్ని తెలంగాణ జనం ఆశ్చర్యంగా చూస్తున్నా, పార్టీలో ఆధిపత్యం కోసం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావుల మధ్య సాగే  ప్రచ్ఛన్నయుద్ధం జనానికి పాత విషయమే! ‘కుటుంబ’ పెద్ద కేసీఆర్‌ పక్షపాత ధోరణి కూడా ఇందుకు కారణమే! రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవన్నది రాజకీయాల్లోనే ఎక్కువమార్లు రుజువైంది.

నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం విషయంలో గత ఎన్నికల ప్రచారంలో ఆ ‘కుటుంబం’ను కేంద్రకంగా  కాంగ్రెస్‌ ఎండగట్టిన తీరు నుంచి నిన్నా, ఇవాల్టి బీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత లుకలుకలు వరకు ఇదే కొట్టొచ్చినట్టు కనిపించే అంశం. ‘ఏమీ లేదు, అంతా ఉత్తిదే’ అని పార్టీ నాయకత్వం ఎంత కొట్టి పారేస్తున్నా.. బీఆర్‌ఎస్‌ లోలోపల ఏదో అంతర్మథనం జరుగుతోందన్నది కాదనలేని వాస్తవం. హరీష్‌రావు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘కేసీఆర్‌ మా నాయకుడు, ఆయన నాయకత్వంలో నేనొక సుశిక్షితుడైన, నిబద్ధతగల సైనికుడ్ని, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను’ అని  123వ సారి కాబోలు ఒక ప్రకటన చేశారు. ఇంకో అడుగు ముందుకు వేసి ‘కేసీఆర్‌ నిర్ణయం తీసుకొని కేటీఆర్​ను పార్టీ అధినేతను చేసినా విభేదించకుండా, సహకరిస్తూ పనిచేయడానికి నేను సిద్దమే’ అనీ పేర్కొన్నారు. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? హరీష్‌రావు అలా ‘పలుకుతున్నారా?’ లేక ఆయన చేత అలా ‘పలికిస్తున్నారా’ అన్నది పార్టీ లోపలా, బయటా ఒక పెద్ద ప్రశ్నా  చర్చ!

బలవంతపు పెళ్లి ప్రకటనలా...

కేటీఆర్‌ ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. హరీష్‌ను కాకుండా రేపు కేటీఆర్‌ను అసెంబ్లీలో ‘ప్రతిపక్ష నేత’ను చేస్తే?  కేసీఆర్‌ ఎలాగూ క్రమంగా అసెంబ్లీకి రావడం లేదు కనుక, అలాంటిదేదో జరిగి అదే నిజమైతే? హరీష్‌కు కావాలని ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే భావన బీఆర్‌ఎస్‌లో బలపడుతుంది. పార్టీలో అసంతృప్తి ప్రబలుతుంది. బీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంతో బలపడి ఉన్న హరీష్‌ బంధం దృష్ట్యా అది పార్టీకి అంత ప్రయోజనకరం కాదు. 

ఎందుకంటే, పార్టీ ఏర్పాటుకు కేసీఆర్‌ అక్షరాలు దిద్దేముందు పలక కొనుక్కొచ్చిన కార్యకర్త హరీష్‌!. ఆయనకు పబ్లిక్​ అకౌంట్స్​ కమిటీ (పీఏసీ) దక్కనీయకుండా పాలక పక్షం వ్యూహం పన్నినప్పుడు హరిష్​కు అనుకూలంగా సొంత పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. రేపటి నిర్ణయాలకు వ్యతిరేకత తలెత్తకుండా ఉండటానికి ముందస్తు వ్యూహంలో భాగంగా హరీష్‌ చేత ఈ ‘వీర విధేయ పలుకులు’ తెలివిగా చెప్పించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

అదే నిజమైతే హరీష్‌ వారి ట్రాప్‌లో పడ్డట్టే.  దానివల్ల ఆయన బలహీనపడే ఆస్కారముంది. నిజానికి పార్టీలో  క్లిష్ట పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో వాటిని చక్కదిద్ది హరీష్‌.. సంక్షోభ నివారకుడిగా పేరు తెచ్చుకున్నారు. హరీష్‌రావు తరచూ నిజాయితీ నిరూపించుకునేలా ఒత్తిడి తేవడం వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం కన్నా, ఆయన ‘వీర విధేయత’ ప్రకటనతో బలహీనపడితే అది ఆయనకే కాకుండా పార్టీకి కూడా నష్టమే!

కవిత  ‘ఒంటరి’ వ్యూహం

పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత క్రియాశీలం కావడం అధినేతకు ఇష్టం లేదనే ప్రచారం వల్లనేమో పార్టీ ముఖ్యులెవరూ ఆమె వెంట నడవటం లేదు. పైగా, ఆమెను ‘ఒంటరి’ చేయాలనే లోతైన వ్యూహమేదైనా ఆలోచించి, హరీష్‌ చేత కేటీఆర్‌కు మద్దతు మాటలు పలికించారో తెలియదు. ఆమె అలా భావించడానికి గల ఆస్కారాన్ని పార్టీ వర్గాలు కొట్టివేయటం లేదు. భౌగోళిక తెలంగాణయే తప్ప సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడ లేదని కవిత చేసిన ప్రకటన పార్టీ లోపల, బయటాచర్చను లేవనెత్తింది. అందులో  కొన్ని ఆమెను ఉద్దేశించిన విమర్శలు కూడా ఉన్నాయి. ఆమెకవి నచ్చినట్టు లేదు. 

సోషల్‌ మీడియా వేదికగా ఎవరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో తెలుసని, సమయం వచ్చినపుడు పేర్లు వెల్లడిస్తానని కవిత పత్రికాముఖంగా హెచ్చరించిన సందర్భంలోనే హరీష్‌రావు మీడియా ముఖంగా మాట్లాడారు. పార్టీలో నాయకత్వ పోరేదీ లేదని, అంతా కలిసే ఉన్నామని చేసిన విధేయ ప్రకటనే పార్టీ అంతర్గత లుకలుకలకు నిదర్శనం.  గతంలో ఎన్టీఆర్​వ్యవహారశైలిని టీడీపీ ముఖ్యనాయకులు లోలోపల వ్యతిరేకిస్తున్నపుడు కూడా విధేయ ప్రకటనలు వచ్చేవి.  ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తు.చ తప్పకుండా పాటిస్తామని చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ వంటి వారు ప్రకటించారు. అంతే తప్ప, ‘నాయకత్వ పగ్గాలు లక్ష్మీపార్వతికిచ్చినా కిమ్మనక పనిచేస్తాం’ అని పలికించే సాహసం వ్యూహకర్తలూ చేయలేదు, వీరూ పలుకలేదు.

ఎవరికి ప్రయోజనాలున్నాయి?

పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల్లో దేని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయన్నది బోధపడటం లేదు. అంతిమంగా పార్టీ ప్రయోజనాలు భంగపోతున్న విషయాన్ని ముఖ్యులెవరూ గుర్తిస్తున్నట్టు లేదు. వరుసలు, బంధాలు, బంధుత్వాల రీత్యా హరీష్‌,  కేటీఆర్‌, కవిత ఎంతో దగ్గరి వారే! కానీ, ఒకరి నీడను మరొకరు నమ్మనంత అనుమానాలు, అభద్రతా భావనలున్నాయని వారిని దగ్గరగా గమనించే పార్టీ వర్గాలే చెబుతాయి. 

పార్టీలో లుకలుకల గురించి బయట ప్రచారం జరుగుతున్న వేడిలోనే కేటీఆర్‌ శుక్రవారం స్వయంగా బావ హరీష్‌రావు ఇంటికి వెళ్లి కలిశారు. గత కొంతకాలంగా ముభావంగా ఉండటం ముక్తసరిగా కలవటం తప్ప ఇద్దరూ చేయీ చేయీ కలిపి పార్టీ నిర్మాణాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నది చాలా అరుదు. వరంగల్‌లో ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ ప్లీనరీ వ్యవహారాలు చూసే బాధ్యతను కేసీఆర్‌ మొదట హరీష్‌రావుకు అప్పగించారు. తర్వాత ఏం జరిగిందో కేటీఆర్‌ అంతా తానయ్యారు. 

ప్లీనరీ కటౌట్స్‌, హోర్డింగ్స్‌, పోస్టర్లలో కేసీఆర్‌, కేటీఆర్‌ తప్ప మరొకరి ఫోటో కూడా లేని పరిస్థితి పార్టీ శ్రేణుల్లో ముచ్చట్లకు ఆస్కారం కల్పించింది. ప్లీనరీ ముగిసిన తర్వాత, మే నెల మొదటి వారంలో కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఒక లేఖ రాసినట్టు తెలిసింది. ప్లీనరీ ఉత్సవాల మంచి-చెడుల్ని ఆమె అందులో మనసు విప్పి చెప్పినట్టు సమాచారం. తానొక 45 నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు తెలిసి వచ్చిన అంశాల్నీ ఆమె అందులో పొందుపరచినట్టు తెలుస్తోంది. కానీ, తండ్రీ-తనయలు పరస్పరం ముచ్చటించుకోవడం కాకుండా ఉత్తరాలు రాసుకునేంత ఎడం వారి మధ్య పెరిగిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆమెలో ఏదో అసంతృప్తి రగలటం నిజమని బీఆర్‌ఎస్‌ సగటు కార్యకర్త భావిస్తున్నారు.

అప్పుడన్నీ చెల్లినాయ్‌..

ఉద్యమకాలంలో వ్యూహాత్మకంగా కేసీఆర్‌ మౌనం వహించినా, అధికారంలో ఉన్నపుడు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించినా చెల్లింది. కానీ, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో ఉంది. 2023, 24 రెండు వరుస ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ను ఇక పైకి లేవకుండా తొక్కేయాలని పాలకపక్షం కాంగ్రెస్‌ యత్నిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఎత్తుగడలు వేస్తున్న బీజేపీతో ప్రమాదం మరోవంక పొంచి ఉంది. పార్టీలో ఏది ఎలా జరిగినా చెల్లుబాటవుతుందని ఇప్పుడు భావించడం ఆత్మహత్యా సదృశం. సర్వశక్తులు కూడగట్టుకొని ప్రత్యర్థి పాలకపక్షంపై పోరాడాల్సిన సమయంలో పార్టీ నాయకుల మధ్య అంతర్గత స్పర్ధలు, కుమ్ములాటలు బీఆర్‌ఎస్‌ మనుగడకే ప్రమాదమని నాయకత్వం గ్రహించాల్సిన సమయమిది. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టగలిగేది, పెట్టాల్సింది ఒక్క కేసీఆరే!

కుటుంబమే పెద్ద బలహీనతగా మారుతోందా?

రాజకీయాల్లో ఒకోసారి పార్టీకి బలం అయిన అంశమే బలహీనత కూడా అవుతుంది.  ఫలితం, పూలమ్మిన చోట కట్టెలమ్మే పరిస్థితి!  

ఉద్యమ పార్టీగా పుట్టి విస్తరిస్తూ, రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది, తెలంగాణ ఏర్పడ్డాక తొలి పదేళ్లు  పాలకపక్షంగా ఉన్న టీఆర్​ఎస్​కి, దాని వ్యవస్థాపకుడైన కేసీఆర్‌కు ఆయన కుటుంబం మొదట్లో ఒక పెద్ద బలంగా ఉండేది. కేసీఆర్‌ కుటుంబంలోని ఆయన తనయుడు కేటీఆర్‌, తనయ కవిత, మేనల్లుడు హరీష్‌రావు వంటి వారి చొరవ, ప్రత్యర్థులపై విరుచుకుపడే తెగింపు, ప్రసంగ ధాటి జనం ప్రశంసల్ని పొందాయి.  కీలక పదవులు, హోదాలు వారు చేపట్టినా వాటికి జనామోదం లభించింది. రాను రాను పార్టీకి ఆ కుటుంబమే ఒక పెద్ద బలహీనతగా మారుతోందా? చూడ్డానికి ఇది సాధారణ ప్రశ్నగానే కనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా పరిశీలిస్తే విషయం బోధపడుతుంది. 

- ఆర్​. దిలీప్ రెడ్డి ,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ–