కామారెడ్డి జిల్లాలో ఆడబిడ్డలకు మరో ఆదాయ మార్గం..సహజ ఉత్పత్తుల మార్కెటింగ్‌‌‌‌కు శ్రీకారం

కామారెడ్డి జిల్లాలో ఆడబిడ్డలకు మరో ఆదాయ మార్గం..సహజ ఉత్పత్తుల మార్కెటింగ్‌‌‌‌కు శ్రీకారం
  • మహిళా సమాఖ్యల ద్వారా త్వరలోనే సబ్బులు, షాంపులు సప్లయ్​
  • తక్కువ ధరకే ఉత్పత్తులు అందించేందుకు చర్యలు
  • కంపెనీలతో జిల్లాస్థాయి ఒప్పందానికి సన్నాహాలు పూర్తి

కామారెడ్డి, వెలుగు : మహిళా సంఘాల బలోపేతం కోసం కాంగ్రెస్​ సర్కార్ ఎన్నో మార్గాలను అన్వేషిస్తోంది. వారి ఆదాయాన్ని పెంచి ఆర్థికంగా నిలదొక్కుకునేలా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మహిళా సమాఖ్యల ఆదాయాన్ని పెంచేందుకు ‘మార్కెటింగ్’ కార్యక్రమానికి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. ‘ఆరోగ్యం ఆదాయం ఆనందం’ అనే నినాదంతో సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూలను జిల్లా సమాఖ్య ద్వారా మార్కెటింగ్ చేయనున్నారు. దీంతో జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలకు ఆదాయం సమకూరనుంది.  వీటి సరఫరా కోసం సహజ ఉత్పత్తుల తయారీ కంపెనీతో జిల్లాస్థాయిలో ఒప్పందం చేయించనున్నారు.

ముందుగా సబ్బు, షాంపూ..

ప్రతి ఇంట్లో నిత్యం బట్టల సబ్బు, ఒంటి సబ్బు, షాంపూ, టీ పౌడర్ వంటి వస్తువులను వినియోగిస్తాం. ఇక నుంచి వీటిని దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి అవసరం లేకుండా మహిళా సంఘాల సభ్యులే సరఫరా చేయనున్నారు. సహజ సిద్ధంగా తయారు చేస్తున్న  హైదరాబాద్​కు చెందిన కంపెనీతో జిల్లా సమాఖ్య ఒప్పందానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఫస్ట్ వివిధ రకాల సబ్బులు, షాంపూలను మార్కెటింగ్​ చేయనున్నారు. 

ఈ ఉత్పత్తులను ఆయూష్​ కూడా ఆమోదించింది. నిమ్మ, పూలు, సున్ని పిండి వంటి పదార్థాలతో తయారు చేసిన సబ్బులు ఉన్నాయి.   మొదటిగా వివిధ రకాల ఒంటి సబ్బులు, షాంపూలు సమాఖ్య బ్రాండ్ పేరుతో తయారై, మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఉత్పత్తులకు వచ్చే ఆదరణ, మార్కెటింగ్​ పరిస్థితులను గమనించిన  తర్వాత మరిన్ని ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు. 

డైరెక్ట్  సప్లయ్​తో  ఆదాయం.. 

 వివిధ సబ్బులను కంపెనీ ఉత్పత్తి చేసి జిల్లా సమాఖ్య బ్రాండ్​తో నేరుగా సరఫరా చేస్తుంది. జిల్లా సమాఖ్యకు అతి తక్కువ మార్జిన్​తో అందజేస్తారు. మండల, గ్రామ సమాఖ్యకు కొంత ఎక్కువ మార్జిన్​తో ఇస్తారు. ఈ దశల్లో కూడా మహిళా సమాఖ్యకు లాభం రానుంది.   సభ్యులకు కూడా బయటి మార్కెట్​ కంటే తక్కువ రేటుకు సబ్బులు, షాంపులు దొరుకుతాయి. ఇప్పటికే కంపెనీ ప్రతినిధులతో జిల్లా స్థాయి సంప్రదింపులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ ఉత్పత్తులు వినియోగదారుల చేతికి అందనున్నాయి.  

జిల్లాలో సభ్యుల వివరాలు..

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 17,203  సంఘాలు ఉండగా, ఇందులో  1,79,417 మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో  2,652 సంఘాలు ఉండగా, 26,620 మంది మెంబర్లు ఉన్నారు. కొత్తగా మరో  12వేల సంఘాలు ఏర్పాటవుతున్నాయి. బ్యాంక్ లింకేజీ, స్ర్తీనిధి ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకు ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనందిస్తోంది. చిరు వ్యాపారాలు, పాడి గేదెలను ఇప్పిస్తుండడంతో మహిళా సంఘాల కుటుంబాలకు ఆదాయం సమకూరుతోంది. 

బస్సుల కొనుగోలు,  క్యాంటీన్లు, సొలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్​ల వంటి వాటి ఏర్పాటుతోపాటు స్కూల్​ డ్రెస్సులు కుట్టిస్తూ ఉపాధి కల్పిస్తోంది. మరింతగా ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతో సహజ సిద్ధమైన ఉత్పత్తుల మార్కెటింగ్​కు శ్రీకారం చుట్టింది.  త్వరలోనే ఈ ఉత్పత్తులను మహిళా సమాఖ్యల ద్వారా సప్లయ్ చేయనున్నట్లు డీఆర్డీవో సురేందర్ పేర్కొన్నారు.