
కాంగ్రెస్ ఒకసారి మాట ఇస్తే అది సాధించేవరకు ఎంతవరకైనా పోరాడుతుందని చరిత్ర చెబుతోంది. అందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే నిదర్శనం. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అలాంటి సందర్భమే పునరావృతమైంది. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచింది.
ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ భరోసా నింపింది. దీంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని తమ హృదయాల్లో నిలుపుకోవడంతో కొందరు అక్కసుతో కోర్టుల ద్వారా రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవాలనే కుట్రలకు తెరలేపారు. కాంగ్రెస్‌కు ఇలాంటివేమీ కొత్తకాదు. వెనకబడిన సామాజిక వర్గాల సంక్షేమానికి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా న్యాయపరంగా అయినా, ప్రజాక్షేత్రంలో అయినా పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకంజ వేయదు.
‘ఎవరెంతో వారికంత న్యాయం’ అనే సిద్ధాంతానికి కట్టుబడిన కాంగ్రెస్ జనాభా పరంగా 85 శాతానికిపైగా ఉన్న బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం అందించాలని కంకణం కట్టుకుంది. పార్టీ అధినేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా ఆ లెక్కల ఆధారంగా సామాజిక న్యాయం జరగాలనే సదుద్దేశంతో విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచింది. రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చట్ట బద్దత కోసం రాష్ట్రపతికి పంపగా అక్కడ పెండింగ్ లో ఉంది.
రాష్ట్రపతి ఆమోదం ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే అది గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లి మళ్లీ పెండింగ్‌లో పడింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన పరిస్థితుల దృష్ట్యా బీసీలకు అన్యాయం జరగకూడదనే దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయడంతో బడుగు బలహీన వర్గాలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా ఎంపికయ్యే సువర్ణావకాశం వచ్చింది.
హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకోలేదు
తెలంగాణ ప్రభుత్వం జీవోకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు సామాజిక న్యాయం దక్కిందనే ఆనందంతో బీసీలు నామినేషన్లు వేస్తున్న సమయంలో కొందరు దురుద్దేశంతో న్యాయస్థానం ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించడం శోచనీయం.
కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గడువు సమయం సమీపిస్తున్న వేళ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ కొందరు హై కోర్టుకు వెళ్లగా కొన్ని సాంకేతిక అంశాల కారణంగా న్యాయస్థానం దానిపై స్టే విధించింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం కోర్టు స్టే ఇచ్చింది కానీ, జీవోను కొట్టి వేయలేదు. కేసును వాయిదా వేస్తూ స్టే ఇచ్చింది. కానీ ఎక్కడా బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటూ తీర్పు ఇవ్వలేదు.
కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగానే..
అసెంబ్లీ ఎన్నికల ముందు ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ లో ప్రకటించిన విధంగా కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిల్చింది. దీంతో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో జాతీయస్థాయిలో కులగణనకు కేంద్రం సిద్ధపడడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజయం. కులగణన గణాంకాల అనుగుణంగా అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం, అనంతరం ఆర్డినెన్స్ జారీ, చివరికి జీవో విడుదల వంటి చర్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతకు నిదర్శనంగా నిలిచాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబరు.9 కి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. గవర్నర్ వద్ద బిల్లు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఏకపక్షంగా రిజర్వేషన్లను ప్రకటించలేదని రాష్ట్రంలో శాస్త్రీయబద్దంగా కులగణన నిర్వహించి వాటి లెక్కల ఆధారంగా సామాజిక న్యాయం అందించాలనే ఉద్దేశంతో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు కోర్టుకు విన్నవించారు.
సర్వేలో ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా ప్రభుత్వం లక్ష మందికిపైగా సిబ్బందిని, 75 వేలకుపైగా డేటా ఆపరేటర్లను కూడా ఏర్పాటు చేసి విజయవంతంగా కులగణన పూర్తి చేసింది. దేశంలో ఏ రాష్ట్రం వద్ద లేని విధంగా తెలంగాణలో సామాజిక వర్గాల వివరాలుండడం రాష్ట్రానికి గర్వకారణం.
ఆ రెండు పార్టీలు కేసులో ఇంప్లీడ్ కాలేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ సహకరించలేదు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బీజేపీ తీరును తప్పుపడితే బీఆర్ఎస్ మౌనం దాల్చింది.
బీసీలకు న్యాయం జరగడం పెత్తందారి వ్యవస్థతో కూడుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు. బీసీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఫెవికోల్ బంధం చివరికి కోర్టులో నిరూపితమైంది. రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలతో పాటు పలువురు హైకోర్టులో ఇంప్లీడ్ అయితే బీఆర్ఎస్, బీజేపీ తరఫున కాకపోవడమే ఇందుకు నిదర్శనం.
న్యాయస్థానంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తాత్కాలికంగా బ్రేక్ పడినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దీనిపై ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపరంగా ముందుకెళ్తుంది. సామాజిక న్యాయమే కాంగ్రెస్ లక్ష్యం. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నిజస్వరూపాలను కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తుంది.
బడుగు, బలహీన వర్గాల బాగును చూడలేని దుష్ట శక్తుల వలలో చిక్కుకోకుండా బీసీ సామాజిక సంఘాలు, నేతలు, ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ సమయం వచ్చినప్పుడు ‘నోటి కాడ ముద్ద’ లాగేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పాలి.
కొంత ఆలస్యమైనా బీసీల సుదీర్ఘకాల ఆశయాలను, కలలను నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ భుజస్కందాలపై వేసుకుంది. బీసీలకు న్యాయం జరిగే వరకు విశ్రమించేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మడమతిప్పని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదాలతో మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఖాయం.
ప్రతిపక్షాల ద్వంద్వనీతి బయటపడింది
బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు సహకరించాల్సింది పోయి అక్కసుతో అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. కులగణన సర్వే మొదలు, హైకోర్టులో స్టే వరకు మొత్తం ప్రక్రియలో ఈ రెండు పార్టీలు కూడబలుక్కొని బీసీలకు అన్యాయం చేస్తున్నాయి.
శాసనసభలో బిల్లుకు బేషరతుగా ఆమోదం తెలిపిన ఈ రెండు పార్టీలు అనంతరం కుట్రలకు తెరలేపాయి. అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు చట్టబద్దత కల్పించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. చట్టబద్దత కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి తేలేని రాష్ట్ర బీజేపీ నేతలు పేద ముస్లింలను నెపంగా చూపిస్తూ బిల్లును అడ్డుకుంటున్నారు. చివరికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా తప్పుపడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరగవంటూ ముందస్తుగానే ప్రచారం చేశారు.
బీసీ రిజర్వేషన్లను తగ్గించిన బీఆర్ఎస్
రెండు దఫాలు రాష్ట్రంలో అధికారం చెలాయిం చిన బీఆర్ఎస్ సామాజిక న్యాయానికి తిలోద కాలిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పాలకులది. రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా పరిమితి విధిస్తూ కేసీఆర్ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన చట్టం బీసీలకు ఉరితాడైంది. బీసీ సామాజిక వర్గం రాజకీయ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిన బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి మరోసారి బీసీలకు అన్యాయం చేస్తోంది.
- బి.మహేశ్ కుమార్ గౌడ్.ఎమ్మెల్సీ, టీపీసీసీఅధ్యక్షులు-