విద్యార్థి మృతి ఘటనలో బాధ్యులను వదిలిపెట్టం... ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

విద్యార్థి మృతి ఘటనలో బాధ్యులను వదిలిపెట్టం... ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  • ప్రిన్సిపాల్, టీచర్ల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు

హుస్నాబాద్, వెలుగు: విద్యార్ధి వివేక్  మృతి ఘటనలో బాధ్యులను వదిలిపెట్టమని ఎస్సీ, ఎస్టీ కమిషన్  చైర్మన్  బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సనాదుల వివేక్ ఈ నెల 7న అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈక్రమంలో కమిషన్  చైర్మన్  సోమవారం స్కూల్​ను సందర్శించి విచారణ జరిపారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక్  మృతి బాధాకరమని, ఈ ఘటనపై విచారణకు కమిటీ వేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్, పోలీస్  కమిషనర్​ను ఆదేశించినట్లు తెలిపారు. 

ఎస్సీ కార్పొరేషన్  ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  విజయ్ భార్గవ్ ను విచారణాధికారిగా  నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సౌడారపు సదానందం, తహసీల్దార్  లక్ష్మారెడ్డి, సీఐ కొండ్ర శ్రీను, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య ఉన్నారు.