రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం పట్టాలెక్కింది. ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి, దిల్ రాజుతో కలిసి మూవీ టీమ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. టీ -సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
హారీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సహా పలువురు దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల కలయికతో రూపొందించిన నెమలి ఈక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆర్ట్ వర్క్‌లో రామ్ చరణ్ ముఖాన్ని ఉంచడం క్యూరియాసిటీని క్రియేట్ చేయగా, ‘యు కెన్ ఇమాజిన్’ అనే క్యాప్షన్ అంచనాలు పెంచుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
