
హైదరాబాద్, వెలుగు: ‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన ‘కథానికల పోటీ–-2025’ విజేతలను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది కథానికలు పోటీకి రాగా, వాటిలో ఎంపికైన ఉత్తమ వాటికి బహుమతులు అందజేయనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు ఎమ్.ఎల్. కాంతారావు వెల్లడించారు.
తెలుగు కథానిక సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి యేటాఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహించే పురస్కార ప్రదానోత్సవం లో సినీ దర్శకుడు బి. నరసింగరావు, సీనియర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
చాగంటి ప్రసాద్ రచించిన ‘తీరని రుణం’ ప్రథమ బహుమతి, ఉప్పలూరి మధుపత్ర శైలజ రచించిన -‘అనుకోని అతిథి’ ద్వితీయ బహుమతి, కొండి మల్లారెడ్డి రచించిన- ‘కర్రెకోడి’ తృతీయ బహుమతికి ఎంపికైందని వివరించారు. యం. శ్రీనివాసరావు ‘సమిధ’, గొర్తివాణి శ్రీనివాస్ -‘వెన్నెలరాగం’, కె. వాసవదత్త రమణ -‘సాగనీ పయనం’, ఎన్. గంగాలక్ష్మి -‘శారద విజయం’, పప్పు శాంతాదేవి ‘ఏది ముఖ్యం?’ ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారని తెలిపారు.