పసుపు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : కోదండ రెడ్డి

పసుపు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి :  కోదండ రెడ్డి
  • కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే విత్తనాలు ఇవ్వాలి
  • పసుపు బోర్డు ఉన్నా న్యాయమైన ధర లేదని ఆవేదన
  • నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుశిక్ష విధించే చట్టం తేవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌లో పసుపు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయమైన ధర, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక యంత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు కమిషన్  చైర్మన్  కోదండ రెడ్డి డిమాండ్  చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌‌‌‌లో పసుపుకు ఎక్కువ ధర లభిస్తుండగా, నిజామాబాద్‌‌‌‌లో ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతు కమిషన్  సభ్యులు సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్ తో కలిసి శుక్రవారం బీఆర్​కే భవన్​లో మీడియా సమావేశంలో కోదండ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్‌‌‌‌లో కేంద్రం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినా.. రైతులకు న్యాయమైన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇక్కడి పసుపులో కుర్కుమిన్  శాతం తక్కువగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఈరోడ్  వంటి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసిందని తెలిపారు. ‘‘సాంగ్లీ మార్కెట్‌‌‌‌లో రాజపురి రకం పసుపులో కుర్కుమిన్ 7 శాతం ఉండగా, నిజామాబాద్‌‌‌‌లో 2 శాతం మాత్రమే ఉందని గత నివేదికలు సూచిస్తున్నాయి. భూమి నుంచి పంట తీయడం, ఉడకబెట్టడం, పాలిష్  చేయడం వంటి పనుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియకు ఆధునిక యంత్రాలు అవసరం. కేంద్రం ఈ బాధ్యత తీసుకొని వచ్చే సీజన్‌‌‌‌కు ముందే యాంత్రీకరణకు చర్యలు తీసుకోవాలి. 

రాజకీయాలను పక్కనపెట్టి రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి. కుర్కుమిన్  శాతం ఎక్కువగా ఉండే విత్తనాలను అందించడంతోపాటు, పసుపు ఆధారిత ఉత్పత్తుల కోసం ప్రాసెసింగ్  పరిశ్రమలను, బ్రాండ్‌‌‌‌ను ఏర్పాటు చేయాలి” అని కోదండ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల విక్రయాలు పెరిగాయని, ములుగు, సూర్యాపేటలో ఇటీవల జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమని భవానీ రెడ్డి తెలిపారు. 

కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పశువులు చనిపోవడం, రైతులు అనారోగ్యం పాలవడం వంటివి జరుగుతున్నాయని వివరించారు. కల్తీని అరికట్టేందుకు కొత్త విత్తన చట్టం అవసరమని భూమి సునీల్  పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయానికి 5 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించే చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్  చేశారు. సంప్రదాయ పంటల సంరక్షణకు ప్రత్యేక బడ్జెట్  కేటాయించాలని, పసుపు బోర్డు రైతులకు లాభదాయకంగా పనిచేసేలా చూడాలని కోరారు.