
కర్నూలు జిల్లాలో ఘోరం విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. బుధవారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా ఆలూరులోని అస్పగిరి మండలం చిగలి గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. స్కూల్ ముగిసిన తర్వాత నీటి కుంటలో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు శశికుమార్, సాయికిరణ్, కిన్నెర సాయి, వీరేంద్ర, బీమా, మెహబూబ్ గా గుర్తించారు. మృతులంతా ఐదవ తరగతి విద్యార్థులుగా తెలుస్తోంది.
చనిపోయిన చిన్నారులు చిగలి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం. బుధవారం స్కూల్ ముగిసిన తర్వాత మొత్తం ఏడుగురు విద్యార్థులు ఊరి చివర కొండ మీద ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీటి కుంటలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఈతకు వెళ్లిన లోతు ఎక్కువగా ఉన్న కుంటలోకి దిగి మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈతకు వెళ్లిన ఏడుగురిలో ఆరుగురు మృతి చెందగా.. మిగిలిన మరొక విద్యార్ధి ఊరికి వెళ్లి ప్రమాదం గురించి స్థానికులకు చెప్పాడు.
ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి చనిపోవడంతో చిగలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు అర్థాంతరంగా తనువు చాలించడంతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.