చరిత్రలోనే తొలిసారి.. బంగారం వేటలో సింగరేణి

చరిత్రలోనే తొలిసారి.. బంగారం వేటలో సింగరేణి
  • గోల్డ్, కాపర్​ గనుల అన్వేషణ లైసెన్స్​ దక్కించుకున్న సంస్థ
  • వేలం పాటలో ఎల్-1బిడ్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన సింగరేణి
  • సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజాల రంగంలోకి ఎంట్రీ
  • కర్నాటకలోని దేవదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదేండ్ల పాటు గోల్డ్, కాపర్ అన్వేషణ
  • ఇది ఫలిస్తే జీవితకాలం 37.75 శాతం రాయల్టీ  
  • సీఎండీ బలరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిబ్బందికి సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

హైదరాబాద్, వెలుగు:  ఇన్నాళ్లూ బొగ్గు  తవ్వకాలకే పరిమితమైన సింగరేణి.. ఇకపై బంగారం, రాగి లాంటి విలువైన  ఖనిజాలను అన్వేషించబోతున్నది. సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కర్నాటకలోని దేవదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వేలంలో  ఎల్​1 బిడ్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నది. ఈ అన్వేషణ ఫలిస్తే సదరు గనుల జీవితకాలం మొత్తం సింగరేణికి 37.75% రాయల్టీ దక్కనున్నది. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. 

‘‘కర్నాటకలోని దేవదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం నిర్వహించిన  వేలం పాటలో పాల్గొన్న సింగరేణి..  ఎల్​1 బిడ్డర్​గా నిలిచింది.  ఈ విజయంతో  కీలక ఖనిజ రంగంలోకి  సింగరేణి శుభారంభం చేసింది..  రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టుగా తొలి విజయాన్ని అందుకున్నది’’  అని హర్షం వ్యక్తంచేశారు. 
కర్నాటకలో కొత్త గనుల అన్వేషణ.. 

దేశంలోనే బంగారం, రాగి ఖనిజాలకు కర్నాటక ప్రసిద్ధి. ముఖ్యంగా దేశంలోని బంగారం ఉత్పత్తిలో రాయచూర్ జిల్లాలోని ‘హుట్టి గోల్డ్ మైన్స్’ వాటా ఏకంగా 80 శాతం ఉన్నది.  ఇప్పటికీ ఈ గని ద్వారా ఏటా సుమారు 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతోపాటు ఇదే రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్​)  దేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఒకప్పుడు ‘బంగారు నగరం’ అని, ‘మినీ ఇంగ్లాండ్’ అని పిలిచేవారు.1880లో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ గని ద్వారా 2001 వరకు సుమారు 800 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ఈ గనిలో తవ్వకాలు ఆగిపోవడంతో కొత్త గనులను అన్వేషిస్తున్నారు.  తాజాగా.. సింగరేణి దక్కించుకున్న దేవదుర్గ్​ సైతం  రాయచూర్ జిల్లా  పరిధిలోనే ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గోల్డ్ , కాపర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్ బ్లాక్ విస్తరించి ఉన్నది. ఇక్కడ గోల్డ్ మినరలైజేషన్ (బంగారు ఖనిజ వనరుల)ను గుర్తించినా.. మైనింగ్​స్థాయిలో ఉందా? లేదా? తేల్చలేదు. ప్రస్తుతం ఈ నిల్వలను గుర్తించే పని  సింగరేణి చేపట్టనున్నది. 

జీవితకాలం రాయల్టీ.. 

రాబోయే ఐదేండ్లలో దేవదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  గనుల్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పూర్తి చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ అన్వేషణ కోసం దాదాపు రూ.90 కోట్లు ఖర్చు అవుతాయని సంస్థ అంచనా వేసింది. అందులో రూ.20 కోట్లు కేంద్రం సబ్సిడీగా అందిచనున్నది. ఖనిజ అన్వేషణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి సమర్పించిన అనంతరం.. ఈ గనులు మైనింగ్ కోసం వేలంలోకి వస్తాయి. మైనింగ్ లైసెన్స్ దక్కించుకున్న సంస్థలు గని జీవితకాలం పాటు 37.75 శాతం రాయల్టీని సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. 

13న వేలం.. 19న ఖరారు.. 

కేంద్ర ప్రభుత్వం గత మార్చి 13న 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం వేలం ప్రక్రియను ప్రారంభించగా, సింగరేణి 3 బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దృష్టి సారించింది. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, ఏపీలోని చంద్రగిరి వద్ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కర్నాటకలోని దేవదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగారం, రాగి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  అన్వేషణకు బిడ్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే  19న జరిగిన వేలంలో దేవదుర్గ్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సింగరేణి  సొంతం చేసుకోవడం విశేషం.  ఈ సందర్భంగా సింగరేణి సీఎండీని, సంస్థ ఉద్యోగులను  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అభినందించారు. 136 ఏండ్ల బొగ్గు తవ్వకాల అనుభవంతో కీలక ఖనిజాల అన్వేషణలోనూ సింగరేణి దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సింగరేణికి అంతర్జాతీయ సంస్థగా ఎదిగే సామర్థ్యం ఉందని, ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.