
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎంత పెద్ద రచ్చకు దారి తీశాయో తెలిసిందే. తాజాగా.. మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు వివాదానికి దారి తీసింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రౌడీయిజం చేశాడని అటవీ శాఖ అధికారులు మీడియా ముందు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడి చేశారని ఫారెస్ట్ ఆఫీసర్స్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, తన అనుచరులు శ్రీశైల శిఖరం దగ్గర ఉన్న అటవీ శాఖ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేశారని.. వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి.. కొట్టుకుంటూ రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం అడవులలో తిప్పారని మీడియా ఎదుట అటవీ శాఖ అధికారులు వాపోయారు. తర్వాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్లో బంధించి దాడి చేసి, వాకీటాకీలు, మొబైల్స్, తీసుకున్నారని మీడియాకు వివరిస్తూ అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలను కూడా విడుదల చేయడంతో అధికారుల చెప్పింది నిజమేనని తేలిపోయింది.
ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరతామని అధికారులు తెలిపారు. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికారం చేతుల్లో ఉందని హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శలున్నాయి. ఎమ్మెల్యేలు పట్టు తప్పుతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై స్థానిక కేడర్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై చేసిన దాడిపై ఎలా స్పందిస్తారోనని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.