పంజాగుట్ట ఫ్లైఓవర్పై నుంచి కిందపడ్డ బైక్..ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినయ్

పంజాగుట్ట ఫ్లైఓవర్పై నుంచి కిందపడ్డ బైక్..ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినయ్

హైదరాబాద్: అర్థరాత్రి పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకెళ్లిన ఓ బైక్, ఫ్లైఓవర్ సైడ్ వాల్ ను ఢీకొట్టి కిందపడింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో వారి చేతులు, కాళ్లు విరిగాయి.

మంగళవారం (ఆగస్టు 20) అర్థరాత్రి ముగ్గురు యువకులు బైక్ పై బెగంపేట నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డు ఖాళీగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదం వెనుక కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువకులు మద్యం మత్తులో వాహనం నడిపారా?.. అతివేగం వల్లే నియంత్రణ కోల్పోయారా?.. అనే కోణంతో దర్యాప్తు చేస్తున్నారు. బైక్ కింద పడిన తర్వాత దాదాపు 200 మీటర్ల దూరం వరకు రోడ్డును రాకుతూ వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇది ఆ వాహనాన్ని ఎంత అతివేగంగా నడిపారన్నది స్పష్టంగా తెలియజేస్తోంది.ప్రమాదంలో గాయపడిన యువకులు వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ ప్రమాదంతో వేగం నియంత్రణ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జరిగితే అనర్థాలపై పోలీసులు మరోసారి హెచ్చరించారు. యువత నిర్లక్ష్యం ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుందని స్పష్టం చేశారు.