'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్..  అసలేం జరిగిందంటే?

 ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌ను విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బంధువుపై దాడి చేయించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మాత దాసరి కిరణ్ రెండేళ్ల క్రితం తన దగ్గరి బంధువైన గాజుల మహేష్ వద్ద రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. పలుమార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో, ఆగస్టు 18న మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డబ్బు గురించి ప్రస్తావించగా, కిరణ్ తన అనుచరులతో మహేష్ దంపతులపై దాడి చేయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మహేష్ పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి, హైదరాబాద్‌లో ఉన్న కిరణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

దాసరి కిరణ్ కుమార్ ‘రామదూత క్రియేషన్స్’ బ్యానర్‌పై ‘జీనియస్’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వంగవీటి’, ‘సిద్ధార్థ్’ వంటి చిత్రాలను నిర్మించారు. అయితే, ఆయనకు అత్యంత పేరు తెచ్చిన చిత్రం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాతగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుతెచ్చుకున్నారు.