క్రేజీ బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty), తన తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో కృతిశెట్టి, యూత్ ఆడియెన్స్‌లో అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో కూడా తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అయితే ఆ తరువాత వచ్చిన ‘కస్టడీ’, ‘మనమే’, ‘ది వారియర్’, ‘మాచెర్ల నియోజకవర్గం’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో టాలీవుడ్‌కు కొంత బ్రేక్ ఇచ్చి కోలీవుడ్‌పై దృష్టి సారించిన కృతి, అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.
వాటిలో ముందుగా చెప్పుకోవాల్సి చిత్రం కార్తి హీరోగా వస్తున్న ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దీనికి దర్శకుడు. అలాగే ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా ఆమె నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే కృతిశెట్టి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా రూమర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, సౌత్ లో కృతి శెట్టి సంపాదించుకున్న పాపులారిటీ, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ ఫ్యాక్టర్ ఆమెకు నార్త్‌లో బిగ్ ఛాన్స్ తెచ్చిపెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు టైగర్ శ్రాఫ్ హీరోగా మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న నెక్ట్స్ మూవీకి కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకుముందు టైగర్ శ్రాఫ్ సినిమాల ద్వారా నిధి అగర్వాల్, కృతి సనన్, దిశా పటానీ లాంటి హీరోయిన్లు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాల్లో వారి గ్లామర్ షో తదుపరి లెవల్‌లో ఉంటుందన్నది తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో కృతి శెట్టి నటించనున్న నేపథ్యంలో, ఆమె ఎలాంటి అవతార్‌లో కనిపించబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఈ విషయంపై కృతిశెట్టి క్లారిటీ ఇస్తూ.. ‘‘నేను ముంబైలోనే పుట్టి పెరిగాను. అందుకే హిందీలో పని చేయాలన్న కోరిక నాకు మొదటి నుంచే ఉంది. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషలు నేర్చుకోవాల్సి వచ్చినా, హిందీ మాత్రం నాకు మాతృభాష లాంటిదే. నటన వర్క్‌షాప్‌లకు అటెండ్ అయినప్పుడు అక్కడి చర్చలన్నీ హిందీలోనే సాగేవి. అందువల్ల ఆ వాతావరణం నాకు ఎంతో సౌకర్యంగా అనిపించేది. హిందీలో నటించాలన్న ఆసక్తి కూడా అదే సమయంలో మరింత పెరిగింది.
కెరీర్ స్టార్టింగ్ లోనే హిందీలో కొన్ని అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ డేట్స్ కుదరకపోవడం, అక్కడి పని విధానం దక్షిణాదితో పోలిస్తే భిన్నంగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్‌లను అంగీకరించలేకపోయాను. పైగా నా తొలి హిందీ సినిమా ఎలా ఉండాలన్న విషయంలో నాకు కొన్ని ఆశలు ఉండేవి. ఆ సమయంలో వచ్చిన అవకాశాలు వాటికి సరిపోలలేదు. అయితే త్వరలోనే హిందీలో మంచి అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని కృతి శెట్టి వెల్లడించింది.
