హైదరాబాద్ సిటీ, వెలుగు: చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన ‘వాల్మీకి రామాయణ సంగ్రహం’ గ్రంథావిష్కరణ సభ మంగళవారం సురభారతి ఆధ్వర్యంలో ఓయూలో జరిగింది. సభాధ్యక్షుడిగా ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ.. చిలకమర్తి రచనలు చాలా సరళంగా నేటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ఆచార్య రాములు మాట్లాడుతూ.. చిలకమర్తి అనుకున్నది సాధించగల ఋషి అని అభివర్ణించారు. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. మొల్ల రామాయణంలా చిలకమర్తి చాలా సరళ శైలిలో పద్యాలు రాశారని, ఇది చిలకమర్తి రామాయణంగా ప్రసిద్ధి చెందుతుందని ఆశిస్తున్నానన్నారు. పూర్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, గ్రంథ సంపాదకులు డా. పి. మాణిక్యాంబ పాల్గొన్నారు.
