ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పర్యాటక శాఖ ఆఫీసర్లు సమావేశమై ప్రాజెక్టు వివరాలను తెలిపారు. లకారం పార్క్ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 ఎకరాల్లో ఆధునిక హోటల్ నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను ఆఫీసర్లు మంత్రికి వివరించారు. తొలుత ఈ ప్రాజెక్టుకు ‘హరిత హోటల్’ అనే పేరు ప్రతిపాదించగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘హరిత భవన్’గా పేరు మార్చాలని మంత్రి తుమ్మల సూచించారు.
సమావేశంలో పర్యాటక శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సరిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ నరేశ్, కన్సల్టెంట్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు హరిత భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి తుమ్మల లేఖ రాశారు. హరిత భవన్ ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు, భవనం ఉపయోగాలపై లేఖలో పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని, నిధులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి జూపల్లిని కోరారు.
