మానుకోటలో రూ.550 కోట్లతో రోడ్ల విస్తరణ : రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

మానుకోటలో రూ.550 కోట్లతో రోడ్ల విస్తరణ : రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ.550 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కేసముద్రంలో నూతన ఫైర్ స్టేషన్, డీసీసీబీ బ్యాంకు శాఖను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నెల్లికుదురు-కేసముద్రం, నెక్కొండ-గూడూరు, కేసముద్రం-గూడూరు, ఆలేరు-తార్ సింగ్ బాయి, కేసముద్రం-నెక్కొండ రహదారులతో పాటు కేసముద్రం-మహబూబాబాద్ నాలుగు లైన్ల రహదారి విస్తరణకు మొత్తం రూ.550 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 

మహబూబాబాద్ పట్టణ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.20 కోట్లు, మున్సిపల్ అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు కేటాయించామని చెప్పారు. విద్యాసంస్థల అభివృద్ధి, జేఎన్టీయూ భవనం, నెల్లికుదురు హైస్కూల్‌‌ను పబ్లిక్ స్కూల్‌‌గా అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేసముద్రాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని, రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, వ్యాపార కేంద్రాలు కోల్పోయిన వారికి షాపింగ్ కాంప్లెక్స్‌‌లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, అర్చనపల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీశ్​తదితరులు పాల్గొన్నారు.