ఏటీసీలతో నైపుణ్యాలకు పదును

ఏటీసీలతో నైపుణ్యాలకు పదును
  • ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోర్సులు
  • విద్యార్థులకు వంద శాతం ప్లేస్​మెంట్​కు చాన్స్
  • మంచిర్యాల జిల్లాలో మరో మూడు ఏటీసీలు రెడీ​

మంచిర్యాల, వెలుగు: వివిధ ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థులకు వంద శాతం ప్లేస్​మెంట్స్​ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టాటా గ్రూపుతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేస్తోంది. దాదాపు 2 వేల కోట్ల బడ్జెట్​తో రాష్ట్రం లోని 60 ఐటీఐలను ఏటీసీలుగా అప్​గ్రేడ్​ చేస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు నాలుగు ఏటీసీలు సాంక్షన్​అయ్యాయి. మందమర్రి ఏటీసీ నిరుడే ప్రారంభం కాగా, ఈ అకడమిక్​ ఇయర్​లో మంచిర్యాల, నస్పూర్, జన్నారంలో మరో మూడు ఏటీసీలు రెడీ అయ్యాయి. 

ఆధునిక హంగులతో ఏటీసీ బిల్డింగులను నిర్మించారు. మెషీన్ల ఇన్​స్టాలేషన్​ పూర్తికావచ్చింది. ఒక్కో చోట మూడు కంప్యూటర్​ ల్యాబ్​లు ఏర్పాటు చేశారు. టాటా టెక్నాలజీస్ ఆధ్వర్యంలోనే ఇన్​స్ట్రక్టర్లను నియమించనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరలోనే క్లాస్​లు స్టార్ట్​చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ​కంపెనీల్లో చాన్స్ 

ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్​అవసరాలు రోజురోజుకు మారుతున్నాయి. లేటెస్ట్ ​టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో స్కిల్స్, టాలెంట్​కలిగిన మ్యాన్​పవర్​అవసరమవుతోంది. దానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే ఏటీసీల లక్ష్యం. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు రూపొందించిన ఆరు అత్యాధునిక కోర్సులను ఏటీసీలు అందిస్తున్నాయి.

 ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్​సీ, ఆర్​ఆర్​బీ, డీఆర్డీవో, ఇస్రో, బెల్ ​వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అకాశాలు లభిస్తాయి. పాలిటెక్నిక్​ లెక్చరర్, ఇన్​స్ట్రక్టర్ ​పోస్టులకు చాన్స్​ఉంటుంది. అప్రెంటీస్, జూనియర్ ​ఇంజనీర్, టెక్నీషియన్​ వంటి పోస్టులకు అర్హులే. మల్టీ నేషనల్ కంపెనీల్లో జాబ్స్​ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రారంభ వేతనం నెలకు రూ.18 వేల నుంచి రూ.40 వేల వరకు లభిస్తుంది. 

ఈ నెల 28 వరకు అడ్మిషన్లు

జిల్లాలోని మూడు ఏటీసీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో చేరడానికి ఈ నెల 28 వరకు గడువుంది. ఒక్కో ఏటీసీలో ఆరు కోర్సుల్లో కలిపి 172 సీట్లు ఉన్నాయి. టెన్త్​ పాసైనవారు ఏడాది, రెండేండ్ల వ్యవధి గల కోర్సుల్లో చేరడానికి అర్హులు. కానీ విద్యార్థులకు ఈ కోర్సులపై సరైన అవగాహన లేకపోవడంతో ఏటీసీల్లో చేరడానికి ముందుకు రావడం లేదని, సాంప్రదాయ ఐటీఐ కోర్సుల పైనే ఇంట్రెస్ట్​ చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. 

కోర్సుల వివరాలు

కోర్సు పేరు                                                                                                           కాల వ్యవధి    సీట్లు 

                                                                                                   
అడ్వాన్స్​డ్ సీఎన్​సీ మెషినింగ్​ టెక్నీషియన్​                                                          రెండేళ్లు              24

ఆర్టీసియన్​ యూజింగ్​ అడ్వాన్స్​డ్ ​టూల్​                                                                ఏడాది                20

బేసిక్ ​డిజైనర్ అండ్​ వర్చువల్ వెరిఫయర్​(మెకానికల్​)                                         రెండేళ్లు             24

ఇండస్ట్రియల్ ​రోబోటిక్స్ అండ్​ డిజిటల్ ​మాన్యుఫ్యాక్చరింగ్​  టెక్నీషియన్​         ఏడాది                40

మాన్యుఫ్యాక్చరింగ్ ​ప్రాసెస్​ కంట్రోల్​ అండ్​ ఆటోమేషన్​                                        ఏడాది                40

మెకానిక్​ ఎలక్ట్రిక్ ​వెహికల్​                                                                                            రెండేళ్లు             24