- ఆరు నెలల్లో 117 మందికి జైలు శిక్ష, వందల మందికి జరిమానాలు
- రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
- మద్యం తాగడం వల్లే అధిక ప్రమాదాలు
కామారెడ్డి, వెలుగు : మద్యం తాగి వెహికల్ నడుపుతూ చిక్కితే జైలుకు వెళ్లాల్సిందే. కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్పై స్పెషల్ ఫోకస్ పెట్టి దొరికినవారి తాట తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు నెలల్లోనే 117 మందికి జైలు శిక్షలు పడగా, వందల మందికి జరిమానాలు విధించబడ్డాయి.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాజాతతో ప్రచారం, విస్తృత డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. మద్యం తాగిన మందుబాబుల కిక్కు దింపి కోర్లుల్లో హాజరుపరుస్తుండడంతో జైలు శిక్షతోపాటు జరిమానాలు పడుతున్నాయి.
హైవేలలో నిత్యం ప్రమాదాలు..
జిల్లా మీదుగా 2 హైవేలతో పాటు, రాష్ర్టస్థాయి, జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరిగి మృత్యువాతపడడంతోపాటు గాయాలపాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాక్సిడెంట్లకు ప్రధాన కారణాలు వెహికల్స్ స్పీడ్, రాంగ్ రూట్లలో వెళ్లటం, రోడ్డు సరిగ్గా లేకపోవడం, యూ టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఓవర్ టేక్ వంటి వాటితో పాటు, మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని జిల్లా అధికారులు గుర్తించారు. ఓవర్ స్పీడ్ తగ్గించేందుకు జిల్లావ్యాప్తంగా 4 స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
మద్యం సేవించి వెహికల్స్ నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. పోలీస్‌యంత్రాంగం చేపడుతున్న చర్యల ఫలితంగా యాక్సిడెంట్లు కొంత మేరకు తగ్గాయి. గత సంవత్సరం 270 మంది చనిపోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 174 మంది మృతి చెందారు.
జైలు శిక్షలు ఇలా..
6 నెలల కాలంలో మద్యం సేవించి వెహికల్స్ నడిపిన వారిలో 117 మందికి కోర్టులు జైలు శిక్షలు విధించాయి. ఒక వ్యక్తికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష పడింది. ఒక రోజు జైలు శిక్ష పడిన వారిలో 76 మంది, 2 రోజులు జైలు శిక్ష పడినవారు 40 మంది, ఒకరికి 7 రోజులు జైలు శిక్ష విధించబడింది.
ప్రజల్లో మార్పు కోసమే చర్యలు
ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మద్యం తాగి వెహికల్ నడుపొద్దు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఒక వ్యక్తికి 13 సార్లు ఫైన్ పడినా మళ్లీ తాగి పట్టుబడ్డాడు. ఇటువంటి వారిని కోర్టులో ప్రవేశపెడితే జైలు శిక్షతోపాటు జరిమానాలు పడ్డాయి. కొందరిలో మార్పు వచ్చినా మద్యానికి బానిసైనవారి తీరు మారడం లేదు. ప్రమాదాల బారినపడి కుటుంబాలను ఆగం చేయొద్దు. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం. - రాజేశ్చంద్ర, ఎస్పీ కామారెడ్డి జిల్లా
