కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి, 100 మంది ఆచూకీపై సందిగ్ధం

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి, 100 మంది ఆచూకీపై సందిగ్ధం

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో నిన్న అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. గిరిజన కుగ్రామం ఖలాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అధికారులు 75 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు కొండపై నుంచి పడి దాదాపు 30 ఇళ్లు సమాధి అయ్యాయి. ఇక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఈ ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు.

 ఎన్‌డీఆర్‌ఎఫ్ కి చెందిన రెండు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే సహాయక చర్యలను ప్రారంభించగా.. ముంబైకి చెందిన మరో రెండు బృందాలు కూడా ఈ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇదిలా ఉండగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, భారీ వర్షం కారణంగా ముంబైలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.