జన్‌‌ధన్ ఖాతాల్లో 1.5 లక్షల కోట్లు డిపాజిట్లు

జన్‌‌ధన్ ఖాతాల్లో 1.5 లక్షల కోట్లు డిపాజిట్లు

న్యూఢిల్లీ: అందరికీ బ్యాంకింగ్​ సేవలను అందుబాటులోకి తేవడానికి దాదాపు ఏడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన జన్‌‌ధన్‌‌ స్కీమ్ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల విలువ రూ. 1.5 లక్షల కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, డిసెంబర్ 2021 చివరి నాటికి 44.23 కోట్ల ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో  బ్యాలెన్స్ రూ. 1,50,939.36 కోట్లు ఉంది. పీఎంజేడీవై గతేడాది ఆగస్టులో  ఏడేళ్లు పూర్తి చేసుకుంది.  

2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్​ధన్​ యోజనను ప్రకటించారు.  మొత్తం 44.23 కోట్ల పీఎంజేడీవై ఖాతాల్లో 34.9 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, 8.05 కోట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో, మిగిలినవి 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి.  అంతేగాక 31.28 కోట్ల పీఎంజేడీవై లబ్ధిదారులకు రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు   గ్రామీణ,  సెమీ– అర్బన్ బ్యాంకు శాఖల్లో 29.54 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. డిసెంబర్ 29, 2021 నాటికి దాదాపు 24.61 కోట్ల మంది మహిళలు ఖాతాదారులు పీఎంజేడీవైలో చేరారు. స్కీమ్ ప్రారంభమైన  మొదటి సంవత్సరంలో 17.90 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు ఓపెన్​ అయ్యాయి. ఆర్​బీఐ రూల్స్​ప్రకారం, జన్ ధన్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్​ ఉంచాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 8, 2021 నాటికి, మొత్తం జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 3.65 కోట్లు ఉంది.