GHMC నుంచే ఓఆర్ఆర్ దాకా పాలన ..విలీనానికి జీవో రావడమే ఆలస్యం

GHMC  నుంచే ఓఆర్ఆర్ దాకా పాలన ..విలీనానికి జీవో రావడమే ఆలస్యం
  • 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల నుంచి రికార్డులు స్వాధీనం  
  • ఓ వైపు పరిపాలన, మరో వైపు వార్డుల విభజన  
  • ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే చాన్స్​ 
  • ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఐదారు నెలల టైం  

హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీ విస్తరణకు రంగం సిద్ధమైంది. జీవో రావడమే ఆలస్యం.. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లు విలీనం కానున్నాయి. దీని తర్వాత ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకోనున్నది. 

అధికారులు, సిబ్బంది కూడా బల్దియా ఆధీనంలోకి రానున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఔటర్ వరకు విస్తరించిన కొత్త పరిధిలో జీహెచ్ఎంసీ స్వయంగా పరిపాలన  కొనసాగించనున్నది. అనంతరం ఓ వైపు పాలన కొనసాగిస్తూనే  మరో వైపు కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో వార్డుల విభజన కొనసాగించే అవకాశం ఉంది. 

వార్డుల విభజన  కోసం స్థానిక నేతలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్నట్టు సమాచారం. వార్డులు ఫైనల్ చేశాక కార్పొరేషన్లు విభజించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు ఐదారు నెలల పట్టే ఛాన్స్​ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.20 కోట్లు ఉండగా, విలీనం తరువాత 1.50  కోట్లకిపైగా పెరగనుంది. 

నేడో.. రేపో జీవో..

విలీనం ప్రక్రియ గురించి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులతో రెగ్యులర్ గా చర్చిస్తున్నట్టు సమాచారం. విలీనం ప్రక్రియ ఎలా చేస్తే వేగంగా పూర్తవుతుందని, ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలన్న దానిపై డిస్కస్ చేస్తున్నట్లు తెలిసింది. 

విలీనానికి సంబంధించిన జీవో నేడో, రేపో విడులయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, జీవో వచ్చిన వెంటనే మున్సిపాలిటీల్లో జీహెచ్ఎంసీ పాలన మొదలు పెట్టాలా? లేక కటాఫ్ డేట్ పెట్టి అప్పటి వరకు జీహెచ్ఎంసీ అండర్ లోనే అక్కడున్న ఆఫీసర్లతో పనులు  చేయించాలా? అన్నదానిపై చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.  

స్పెషల్ ఆఫీసర్లు ఉండడంతో..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండలిల పదవీకాలం పూర్తయి ఏడాది దాటింది. ప్రస్తుతం అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కమిషనర్లు పాలన చేస్తున్నారు. విలీనం కానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి ప్రస్తుతం కొన్నింటికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లే కొనసాగుతున్నారు. 

మేయర్లు, కార్పొరేట్లు, కౌన్సిలర్లు లేకపోవడంతో ప్రభుత్వానికి కడా పెద్దగా ఎటువంటి  చిక్కులు ఉండవు. స్పెషల్ ఆఫీసర్లు ఉండడంతో విలీన ప్రక్రియ మరింత ఈజీ కానుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే స్పెషల్ ఆఫీసర్లు అందుకు అనుగుణంగా పనులు చేయనున్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన వెంటనే 51 పంచాయతీలను మున్సిపాలిటీల్లో  విలీనం చేశారు. 

ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. ఇప్పుడు వీటిని గ్రేటర్ లో విలీనం చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు ఉంది. అంతలోపు వార్డుల విభజన చేసి, తర్వాత కార్పొరేషన్లని విభజించే అవకాశాలున్నాయి.