ఈసారి టఫ్ ఫైట్..వివిధ సంస్థల సర్వేల్లో వెల్లడి

ఈసారి టఫ్ ఫైట్..వివిధ సంస్థల సర్వేల్లో వెల్లడి
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ.. కాంగ్రెస్ వైపు కాస్త మొగ్గు
  • 10 శాతం పెరిగిన కాంగ్రెస్, బీజేపీ ఓటు షేర్.. బీఆర్ఎస్ ఓటు షేర్ 10 శాతం డౌన్
  • గులాబీ పార్టీలో బుగులు.. అవన్నీ ఫేక్ సర్వేలంటూ ఎదురుదాడి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీకీ అంత ఈజీగా అధికారం దక్కే అవకాశాలు కనిపించడం లేదని, టఫ్ ఫైట్ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బొటాబొటీ మెజారిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి. అయితే ఈసారి జనం కాస్త కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నాయి. గతంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​కు ఈసారి సీట్లు తగ్గుతున్నాయని, అదే సమయంలో గతంతో పోలిస్తే బీజేపీకి సీట్లు పెరుగుతాయని చెబుతున్నాయి. ఈ విషయాలన్నీ ఏబీపీ సీఓటర్, జన్​మత్, తెలంగాణ పల్స్, లోక్​పోల్, పోల్​ట్రాకర్, తెలంగాణ ఇంటెన్షన్స్ తదితర సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడయ్యాయి. 

బలాబలాలు మారొచ్చు..  

ఎన్నికలకు మూడు నెలల ముందే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ​షెడ్యూలు వెలువడినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.  అధికార పార్టీలోని అలకలు, అసమ్మతి వాతావరణాన్ని కాంగ్రెస్ ​తమకు అనుకూలంగా మలుచుకుంది. చేరికలు పెంచుకుని ఆ పార్టీ బలం పుంజుకుంది. అందుకే  సర్వేలన్నింటా కాంగ్రెస్ ముందు వరుసలో నిలిచినట్టు కనిపిస్తోంది. ఇక బీజేపీలో కూడా జోష్ పెరిగింది.

ఇటీవల ప్రధాని మోదీ వరుస సభలతో ఆ పార్టీ పుంజుకుంది. పసుపు బోర్డుతో పాటు ట్రైబల్ యూనివర్సిటీ హామీలు ఇవ్వడంతో బీజేపీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నదనే టాక్​పెరిగింది. ఇదే తీరుగా ఎన్నికల వరకు మరింత పుంజుకుంటే ఇప్పుడున్న బలాబలాలు మారిపోవడం ఖాయమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.  

బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత.. 

సర్వేల ఫలితాలతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో ఆ సర్వేలన్నీ బూటకమంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్​ సర్కారే వస్తుందని ధీమాగా చెప్తున్నది. బీఆర్ఎస్ లీడర్లు పైకి అలా చెబుతున్నప్పటికీ, ఈసారి అధికారం పోతుందేమోనని కొందరు లీడర్లు లోలోపల ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్ ఇప్పటికే​115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు సిట్టింగులకే టికెట్లు ఇచ్చారు. చాలామంది అభ్యర్థులపై అవినీతి ఆరోపణలు ఉండడం, జనాల్లో మంచి ఒపీనియన్​ లేకపోవడం లాంటివి ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశాల్లో ఒకటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులకు చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. ‘మీరేం చేశారని ఓట్ల కోసం వస్తున్నారు?’ అంటూ నిలదీస్తున్నారు. దళితబంధు రావడం లేదని, కమీషన్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలు తమ గ్రామాల్లోకి అడుగు పెట్టవద్దంటూ ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్​గ్రాఫ్​ భారీగా పడిపోయిందని సర్వేల్లో తేలింది. 

జోష్​లో కాంగ్రెస్.. ​

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ను ప్రజలు రెండుసార్లు తిరస్కరించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలు ప్రకటించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నది. హిమాచల్​ప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో.. ఆ ప్రభావం తెలంగాణపైనా పడింది. అసలు ఒకప్పుడు పోటీలోనే లేని కాంగ్రెస్.. ఇప్పుడు అన్ని పార్టీలను దాటేసి ముందు వరుసలో ఉన్నట్టు సర్వేల్లో తేలింది. ఆ పార్టీ అన్ని వర్గాలకూ గ్యారంటీలు, డిక్లరేషన్లు ప్రకటిస్తూ క్రమంగా తన గ్రాఫ్ పెంచుకున్నది. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు సహా బీఆర్ఎస్​కు ఇన్నాళ్లూ దగ్గరగా ఉన్న వర్గాలన్నింటినీ ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్​ తనవైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఆ పార్టీకి అతిపెద్ద సవాల్​అభ్యర్థుల ప్రకటనే. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఆగస్టు నుంచి ఆ పార్టీ నాన్చుతూనే ఉన్నది. స్క్రీనింగ్​కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నా అభ్యర్థుల ఎంపిక పూర్తయితలేదు. అన్ని వర్గాల వాళ్లు తమకు టికెట్లు కావాలంటే తమకు కావాలంటూ హైకమాండ్ ముందే ధర్నాలకు దిగుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత టికెట్​దక్కని చాలా మంది ఆశావహులు రెబల్​గా బరిలోకి దిగే అవకాశముందన్న వాదనల నేపథ్యంలో.. అక్కడ ఓట్లు చీలే చాన్స్ ఉంది. అది పార్టీ గెలుపోటములను ప్రభావితం చేయొచ్చు. అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారన్న దానిపైనే ఆ పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్న టాక్​ వినిపిస్తున్నది.   

బీజేపీ చీల్చే ఓట్లే కీలకం.. 

ఈసారి బీజేపీకి పది సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. అయితే బీజేపీ ఎన్ని ఓట్లను చీలుస్తుందన్న దానిపైనే బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు బీజేపీ తీవ్రమైన పోటీ ఇస్తున్నది. ఇప్పటికే పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ హామీలతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల నాటికి బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోగలిగితే.. ఆ పార్టీ కూడా ఎక్కువ ఓట్లను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణకు వచ్చారు. మహబూబ్​నగర్, నిజామాబాద్​లో సభలు పెట్టి కేడర్​లో జోష్​నింపారు. తాజాగా అమిత్​షా పర్యటించారు. 

పెరిగిన కాంగ్రెస్, బీజేపీ గ్రాఫ్.. 

సర్వేల ప్రకారం బీఆర్ఎస్ ​ఓటు శాతం భారీగా పడిపోనుంది. గతంలో 46.9 శాతం ఓట్లు పడగా, ఈసారి 37.5 శాతానికి తగ్గిపోతుందని సర్వేల్లో వెల్లడైంది. అంటే గతంతో పోలిస్తే ఈసారి అధికార పార్టీ 9.4 శాతం ఓట్లు నష్టపోతుంది. అదే సమయంలో కాంగ్రెస్​, బీజేపీ ఓట్​ షేర్​ పెరిగిందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్​కు గత ఎన్నికల్లో 28.3 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 38.8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ తన ఓట్​షేర్​ను 7 % నుంచి 16.3 శాతానికి పెంచుకున్నట్టు సర్వేల్లో తేలింది.