హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ అవుట్.. కర్నాటక మాజీ ఎంపీ శాంతమ్మ ఇన్​...

హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ అవుట్.. కర్నాటక మాజీ ఎంపీ శాంతమ్మ ఇన్​...

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను జగన్ పక్కన పెట్టారు. కనీసం అసెంబ్లీ సీటుకు కూడా ఆయన పేరు పరిగణించలేదు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాధవ్ కు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన అంచనాలకు అనుగుణంగా ఎంపీగా మాధవ్ గెలుపొందారు. అయితే గత ఐదేళ్లుగా మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆయన మార్పు అనివార్యంగా మారింది. 

గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ నియోజకవర్గానికి మహిళను ఇంఛార్జ్ గా ప్రకటించారు జగన్. హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా బళ్లారి బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమించారు జగన్. హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ కు బదులు కొత్తగా పార్టీలో చేరిన జె శాంతకు (జోలదరాశి శాంత) అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి హిందూపురం వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ పోటీ చేయనున్నారు. దీంతో గోరంట్ల మాధవ్ కు మొండిచేయి చూపించినట్లు అయ్యింది.

 అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే శాంత వాల్మీకి సామాజికి వర్గానికి చెందినవారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.ఏపీలో సీఎం జగన్‌ చేస్తోన్న అభివృద్ధి చూసే పార్టీలో చేరానని.. వైఎస్సార్‌సీపీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు శాంత. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. జగన్ చేస్తున్న మంచి పనులు దేశమంతటా తెలుసన్నారు. ఒక ఇంటికి పెద్దకొడుకు ఎలా బాధ్యతగా ఉంటారో సీఎం జగన్ అలా పని చేస్తున్నారని తెలిపారు. తాను ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని, వాల్మీకి కులానికి గతంలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రమే వాల్మీకిలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారన్నారు.జగన్ పాలనలోనే వాల్మీకిలకు ప్రాధాన్యం లభించిందన్నారు మాజీ ఎంపీ శాంత. వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇక నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్సార్‌సీపీలో పని చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ తాను తోడుంటానని.. అందరం కలిసి జగన్‌కు అండగా ఉందామన్నారు.

గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీరాములుకు శాంత సొంత సోదరి. గాలి జనార్దన రెడ్డి ప్రోద్బలంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో బళ్లారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆమె కర్ణాటక నుంచి వచ్చి హిందూపురంలో పోటీకి సిద్ధమయ్యారు. అయితే శాంత సొంత ఊరు గుంతకల్లు అని చెబుతున్నారు. 

 గత ఎన్నికల్లో హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన శాంతకు అవకాశం ఇచ్చారు. గోరంట్ల మాధవ్ మరోసారి హిందూపురం నుంచి పోటీ చేయాలని భావించినా ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తారా.. మరో చోట అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి.