ఏపీ వర్షాలకు 24 మంది మృతి.. 17 మంది గల్లంతు

 ఏపీ వర్షాలకు 24 మంది మృతి.. 17 మంది గల్లంతు
  • 4 జిల్లాలు 172 మండలాలు, 1316 గ్రామాల్లో అపార నష్టం
  • 23,345 హెక్టార్లలో నీటమునిగి దెబ్బతిన్న పంటలు
  • వర్ష ప్రభావిత జిల్లాకు తక్షణ సాయంగా రూ.7కోట్లు విడుదల

అమరావతి: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని జనజీవన అస్తవ్యస్థం అయింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా పంటలకు భారీగా నష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదల్లో గల్లంతై.. లేదా ఇళ్లు కూలి ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని, మొత్తం 17 మంది గల్లంతైనట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో మొత్తం 24 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడపలో 13 మంది, అనంతపురం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో నలుగురు చొప్పున మరణించినట్లు పేర్కొంది. అలాగే 17 మంది గల్లంతయ్యారని, కడప జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 4, అనంతపుం, నెల్లూరు జిల్లాల్లో చెరోకరు చొప్పున గల్లంతైనట్టు వివరించింది. రాష్ట్రంలోని 172 మండలాల పరిధిలో మొత్తం 1316 గ్రామాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా అపార నష్టం ఏర్పడినట్లు సమాచారం అందిందని, 23,345 హెక్టార్లల్లో పంట వర్షాలకు కొట్టుకుపోయిందని తెలిపింది. ముఖ్యంగా  19,645 హెక్టార్లల్లో ఉద్యానవన తోటలు, పండ్లు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లగా, ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది. అలాగే కోళ్ల పరిశ్రమకు కూడా 2403 జీవాలు మృతి చెందడం వల్ల 2.31 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.