
పినపాక, వెలుగు: చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన ఘటన పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం పంచాయతీ గీదబయ్యారంలో మంగళవారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిబోయిన పున్నం గొర్లను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 50 రోజుల కింద తాను పెంపుడు కుక్క పున్నంను కరిచింది. గమనించిన అతని కొడుకు సందీప్(25) తండ్రిని రక్షించే క్రమంలో కుక్క అతడిని కూడా స్వల్పంగా గాయపరిచింది.
తండ్రికి వైద్యం చేయించిన సందీప్ తనకు చిన్న గాయమే అని చికిత్స చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కింద సందీప్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని కొత్తగూడెం, ఏలూరు, విజయవాడలోని హాస్పటళ్లకు తీసుకెళ్లారు. కానీ రాబిస్ వ్యాధి లక్షణాలు ముదరడంతో విజయవాడలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.