
హైదరాబాద్ : లక్డికపూల్ లోటస్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన 3 సర్జరీలు చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువు(ఆడ).. బరువు కూడా చాలా తక్కువగా ఉంది. 1.710 కేజీలతో ఒకటిన్నర నెలల ముందుగా జన్మించడంతో శిశువుకు శ్వాస కోసం ఆక్సీజన్, రెస్పిరేటరీ సపోర్ట్ అవసరమని డాక్లర్లు తెలిపారు. వెయిట్ తక్కువగా ఉండటంతో ఊపిరితిత్తుల సమస్య ఉందని గమనించామని చెప్పారు. సాధారణంగా శిశువు తల్లి పాలు తీసుకుంటే.. ఆహార నాళం నుంచి కడుపు, పేగుల్లోకి చేరుతాయి. కానీ ఈ శిశువులో మింగిన పాలు కడుపులోకి తీసుకువెళ్లే ఆహార పైప్ (అన్నవాహిక) డిస్కనెక్ట్ అయిందన్నారు.
దీంతో చిల్డ్రన్ సర్జన్ డాక్టర్ ఎస్. రామస్వామి పర్యవేక్షణలో శిశువుకు అరుదైన మూడు శస్త్రచికిత్సలు చేసి... ప్రాణాలను కాపాడారు. శిశువును సర్జరీ తర్వాత నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 3 రోజుల పాటు వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందించామన్నారు. ఆ తర్వాత శిశువుకు వెంటిలేటర్ తొలగించి ముక్కు నుంచి డైరెక్ట్ గా పేగులోకి పాలు ఇవ్వడం ప్రారంభించినట్లు తెలిపారు. ఇలాంటి సర్జరీలు సక్సెస్ కావడం ప్రపంచంలోనే అరుదు అని డాక్టర్ ఎస్. రామస్వామి తెలిపారు. ఛాతి (దొరకోటమీ), పొత్తికడుపు (ల్యాపరోటమీ)కి సంబంధించిన ఆపరేషన్లతో మూడు లోపాలను సరిద్దిద్దినట్లు చెప్పారు. ఇందుకోసం మా డాక్టర్ల టీమ్ ఎంతో సహకరించిందన్నారు. ఆరోగ్యవంతమైన బేబీతో తిరిగి ఇంటికి వెళ్తున్నందుకు పాప తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్లకు థాంక్స్ చెప్పారు.