- వారం రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు
- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు సైతం
- ఇబ్బంది పెడితే ఆందోళన చేస్తామంటున్న ప్రతిపక్ష లీడర్లు
మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని మూతపడిన సర్ సిల్క్ మిల్లు భూముల్లో నివాసం ఉంటున్న సుమారు 3 వేల మందికి రెవెన్యూ ఆఫీసర్లు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా సంబంధిత ఎంక్రోచ్మెంట్స్వెకేట్ చేయాలని నోటీసుల్లో పేర్కొనడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొన్నది. దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబుకు సైతం ఆఫీసర్లు నోటీసులు అందజేశారు. కంపెనీస్ చట్టం-1956లోని సెక్షన్ 456 ప్రకారం, కోర్టు తీర్పులు, కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
సర్ సిల్క్ మిల్లు చరిత్ర ఇదీ..
నిజాం ప్రభుత్వ హయాంలో 1939లో కాగజ్‌నగర్ శివారులో సర్ సిల్క్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 4 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. ఇక్కడ తయారైన ఆర్టిఫిషియల్ సిల్క్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అయ్యేది. నష్టాల కారణంగా 1985లో ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించగా, 1991లో తిరిగి ప్రారంభమైనా 11 నెలలకే పూర్తిగా మూతపడింది. ఉపాధి కోల్పోయిన కార్మికులు కంపెనీ క్వార్టర్లలోనే నివాసం ఉంటూ స్థానికంగా పనులు చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాల్లో కొందరు ఇళ్లు కట్టుకోగా, మరికొందరు షెడ్లు, గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా జీవిస్తున్నారు. కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు పూర్తిగా అందకుండానే కంపెనీ లివ్విడేటర్ను నియమించి భూములు అమ్మేసింది. భూముల ఆక్రమణలపై 2001, 2006లో హైకోర్టు తీర్పులు కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా
వచ్చాయి.
ఆందోళనకు సిద్ధం...
నోటీసుల నేపథ్యంలో సర్ సిల్క్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందవద్దని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు భరోసా ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ చీఫ్ కవిత, బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం స్పందించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కార్మికులను వారం రోజుల్లో ఖాళీ చేయమనడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, అవరసమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సర్ సిల్క్ కంపెనీ మూతపడిన తర్వాత కార్మికులకు రావాల్సిన చాలా బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
