
- అకడమిక్ ఇయర్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పంపిణీ
- పౌష్టికాహారానికి దూరంగా 56 వేల మంది చిన్నారులు
వనపర్తి, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో రాగి జావ పంపిణీ అకడమిక్ ఇయర్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా స్టార్ట్ చేయకపోవడంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. సర్కారు బడులలో చదివే ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం పూట స్కూల్కు రాగానే రాగి పిండి, బెల్లం కలిపి చేసిన జావ ఇచ్చేవారు. రెండేండ్లుగా స్కూళ్లలో రాగి జావ ఇస్తూ వచ్చారు. ఈ ఏడాది స్కూళ్లు రీ ఓపెన్ అయి రెండు నెలలు దాటినా ఈ స్కీమ్ ప్రారంభించలేదు. వనపర్తి జిల్లాలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్తో కలిపి 540 స్కూల్స్ ఉన్నాయి.ఈ బడుల్లో 56 వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారు.
అందని పోషకాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారంతా కూలీ, వ్యవసాయాధార కుటుంబాలకు చెందినవారే. తల్లిదండ్రులు కూలీకి వెళ్తుండడంతో పిల్లలకు ఉదయం పూట అల్పాహారం అందించలేకపోతున్నారు. దీంతో ఆకలితోనే స్కూళ్లకు వస్తున్నారు. అలా వచ్చిన విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం మాదిరిగా రాగి జావ అందించారు.
పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రెండేండ్లుగా ఉదయం పూట రాగి జావ అందిస్తూ వస్తోంది. రెండున్నర నెలలుగా రాగి జావ అందకపోవడంతో కొందరు విద్యార్థులు నీరసించి పోతున్నారు. వెంటనే రాగి జావ పంపిణీని ప్రారంభించాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.
రెండు రోజులకోసారి..
రాగి జావ ఇవ్వడాన్ని ప్రారంభించాక ప్రతి రెండు రోజులకోసారి వారంలో మూడు సార్లు ఉదయం పూట అల్పాహారంగా రాగి జావ ఇచ్చేవారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్లకు ముఖ్యంగా విద్యార్థినులకు ఎంతోప్రయోజనం చేకూరేది. వంట ఏజెన్సీల వారే రాగి జావను కాచి అందించేవారు. అలా అందించినందుకు తమకు ప్రోత్సాహకంగా కొంత మొత్తం ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా రాగి జావ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే రాగి జావ అందిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.