ఏపీలో ఇవాళ ఒక్కరోజే 96 మంది మృతి

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 96 మంది మృతి
  • ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది మృతి
  • సగానికి తగ్గిన టెస్టులు.. కేసులు తగ్గించే యత్నమా..?
  • టెస్టులు తగ్గడంతో కొత్త కేసులు తగ్గుదల
  • ఇవాళ 12 వేల 994 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు వందకుపైగా మరణాలు నమోదవుతుండగా ఇవాళ కూడా 96 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 58 వేల 835 మందికి పరీక్షలు చేయగా 12 వేల 994 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 96 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది ఉండడం గమనార్హం. 
టెస్టుల విషయంలో తెలంగాణ బాటలో ఏపీ ?
కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ బాటలో నడుస్తోంది. ఇవాళ విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇది కేవలం ఇవాళ ఒక్కరోజుకే అయితే సాంకేతిక కారణాలు అనుకోవచ్చు. లేదంటే తెలంగాణ బాటలో కేసుల సంఖ్య తగ్గించేందుకు టెస్టులు తగ్గించాలని సర్కార్ నిర్ణయించిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రతిరోజు 90వేలకు పైగా టెస్టులు చేసిన ఏపీ ప్రభుత్వం ఇవాళ ఎందుకో 58 వేల 835 టెస్టులే చేసింది. ఫలితంగా కొత్త కేసులు కూడా తక్కువగా అంటే 12,994 గా నమోదయ్యాయి. 

మరోవైపు కరోనా మరణాల ఉధృతి తగ్గకపోవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది చనిపోగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 10 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో 9 మంది,తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో 9 మంది చొప్పున, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లా నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల 373 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  జిల్లాల వారీగా నమోదైన కొత్త పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.