వీడియో: బావిలో పడ్డ కారు..9గంటలు శ్రమించి వెలికితీత

వీడియో: బావిలో పడ్డ కారు..9గంటలు శ్రమించి వెలికితీత
  • కారులో రిటైర్డు ఎస్ఐ పాపయ్య నాయక్ మృతి
  • కారు వెలికితీత పనుల్లో పాల్గొన్న ఫైర్ సిబ్బందిలో రిటైర్డ్ ఎస్ఐ సోదరుడు బుద్దయ్య నాయక్
  • కారులో చనిపోయింది తన అన్న అని తెలిసి కుప్పకూలిన ఫైర్ మ్యాన్ బుద్దయ్య నాయక్

కరీంనగర్: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో గురువారం కారు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. 20 అడుగులకుపైగా లోతున్న బావినీటిలోకి మునిగిపోయింది.  కారు బావిలో పడిన ప్రమాదం తెలిసిన వెంటనే కారును వెలికితీసేందుకు చాలా కష్టపడ్డారు. గజ ఈతగాళ్లతోపాటు ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించారు. దాదాపు 8 గంటలకుపైగా తీవ్రంగా శ్రమించిన అనంతరం ఎట్టకేలకు కారును బావిలోకి తీయగా ఒక మృతదేహం బయటపడింది. కారులో చనిపోయిన వ్యక్తి రిటైర్డు ఎస్ఐ పాపయ్య నాయక్ (59)గా గుర్తించారు. ఈయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎస్ఐగా పనిచేసి ఏడాది క్రితం రిటైర్ అయ్యారు.  పాపయ్య నాయక్ స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ తాండాగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
ఘటనలో వెలుగు చూసిన హ్యూమన్ యాంగిల్
కారు బావిలో పడడం.. దాన్ని బయటకు తీసిన క్రమంలో హృదయాలను కలచివేసే విషయం బయటపడింది. కారు బయటకు తీసేందుకు ఉదయం నుంచి శ్రమించిన ఫైర్ సిబ్బందిలో ఒకరైన బుద్దయ్య నాయక్ సొంత సోదరుడే మృతుడు పాపయ్య నాయక్ అని తేలింది. మృతదేహం బయటకు తీసేంత వరకు తన సొంత అన్నే కారులో ఉన్నాడన్న విషయం బుద్దయ్య నాయక్ కు తెలియదు. మృతదేహం చూడగానే తన సోదరుడేనంటూ బుద్ధయ్య కంటతడిపెట్టుకుని విలపించాడు.