
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు
- అమెరికా షట్‌డౌన్, ఫెడ్ రేట్ల తగ్గింపు..
- యుద్ధాలు, ఫ్రాన్స్,జపాన్‌లో రాజకీయ అనిశ్చితితో గోల్డ్‌కు రెక్కలు
న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరుగుతుండడంతో గోల్డ్ బేస్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిలో డబ్బులు పెట్టేందుకు ఎగబడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాలోని గోల్డ్‌ఈటీఎఫ్‌లలోకి రికార్డ్ స్థాయిలో 902 మిలియన్ డాలర్ల (రూ.7,900 కోట్ల) ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. ఇది 7.3 టన్నుల గోల్డ్ విలువకు సమానం.
దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ రికార్డ్ స్థాయి అయిన 77.3 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.18 బిలియన్ డాలర్ల (రూ.19 వేల కోట్ల) విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. 2024 మొత్తంలో వచ్చిన 1.28 బిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువ. 2023లో 295.3 మిలియన్ డాలర్లు, 2022లో కేవలం 26.8 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. యుద్ధ భయాలు (రష్యా–ఉక్రెయిన్), ఫ్రాన్స్, జపాన్‌లో రాజకీయ అస్థిరత, యూఎస్ షట్‌డౌన్, ఫెడ్ రేటు తగ్గింపు చర్యలతో బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు చూస్తున్నారు.
బంగారం దిగుమతులు పెరిగే ఛాన్స్
గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరిగితే దేశ బంగారం దిగుమతులు పెరగొచ్చు. ప్రస్తుతం గోల్డ్ వాడకంలో ఇండియా రెండో ప్లేస్‌లో ఉంది. గోల్డ్ దిగుమతులు మరింత పెరిగితే ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువవ్వొచ్చు. అలాగే రూపాయి విలువ కూడా పడిపోతుంది. ఇప్పటివరకు బంగారు నగలు, నాణేలు, బార్లకు డిమాండ్ ఉండగా, పట్టణాల్లో నివసించేవారు గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు చూడడం మొదలు పెట్టారు.
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం, రూపాయి బలహీనత, దేశీయ స్టాక్ మార్కెట్లలో అస్థిరత, జియోపాలిటికల్ అనిశ్చితులతో ఈ టైప్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. గోల్డ్ ధరలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 60శాతం పెరగగా, కిందటేడాది 21శాతం ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ మాత్రం 2025 లో 6శాతం మాత్రమే పెరిగింది.
‘‘గతంలో బంగారంలో పెట్టుబడి పెట్టని ఇన్వెస్టర్లు ఇప్పుడు గోల్డ్‌లో మదుపు చేయడానికి ఎగబడుతున్నారు. బంగారం ధరలు తగ్గినా, ఇన్వెస్టర్లు దాన్ని కొనుగోలు అవకాశంగా చూస్తారు. దీంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయి” అని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కమోడిటీస్ హెడ్ విక్రమ్ ధవన్ పేర్కొన్నారు. ఇండియాలో యుటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్‌లు బాగా పాపులర్
అయ్యాయి.
గోల్డ్ @ రూ.1.26 లక్షలు
బంగారం ధర బుధవారం (అక్టోబర్ 08) మరో రూ.2,600 పెరిగి పది గ్రాములకు రూ.1,26,600 లెవెల్‌కు చేరుకుంది. వరుసగా మూడో రోజూ ఎగిసింది. గత మూడు రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.6 వేలు పెరిగింది. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్, జియోపాలిటికల్ టెన్షన్ల వంటి అంశాలతో పెట్టుబడులకు సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గోల్డ్ ధర ఢిల్లీలో మంగళవారం 10 గ్రాములకు రూ.1,24,000 (99.9శాతం ప్యూరిటీ) వద్ద ముగిసింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం రూ.1,24,000 ఉంది. వెండి ధరలు కూడా బుధవారం కేజీకి రూ.3 వేలు పెరిగి రూ.1,57,000 కు చేరుకున్నాయి.