ఎమ్మెల్యే అవమానించారని  కన్నీరు పెట్టుకున్న ఎంపీపీ

ఎమ్మెల్యే అవమానించారని  కన్నీరు పెట్టుకున్న ఎంపీపీ

పరకాల, వెలుగు : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తనను అవమానించారంటూ పరకాల ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి సోమవారం ఉదయం ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన ఆమె తాను దళిత నేతను కావడంవల్లనే ఎమ్మెల్యే అవమానించారని వాపోయారు. సోమవారం జరుగుతున్న రెండో విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు తనను పిలవలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,  నిన్ను ఎందుకు పిలవాలి.. అందరినీ తిడుతున్నావట.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మందలించారని వాపోయారు.   తాను ఎవరినీ తిట్టలేదని, తిట్టినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమేనని చెప్తుండగానే ... నిన్ను పిలవం అంటే పిలవం అంటూ కోపగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దళిత ప్రజాప్రతినిధిని కాబట్టే తనకు అవమానం జరిగిందని,  రెడ్డి సామాజిక వర్గం నేతలనే ఎమ్మెల్యే తన వెంట తిప్పుకుంటున్నారని పేర్కొన్నారు.