పేదరిక నిర్మూలనకు కేరళ మోడల్ : మంత్రి సీతక్క

పేదరిక నిర్మూలనకు కేరళ మోడల్ : మంత్రి సీతక్క
  •     అత్యంత పేదలను గుర్తించి ప్రణాళికలు రూపొందిస్తం: సీతక్క
  •     గ్రామైక్య సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపు
  •     ప్రజా భవన్‌‌‌‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించి కేరళ తరహాలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో గ్రామైక్య సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజాభవన్‌‌‌‌లో సోమవారం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో నిర్వహించిన సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్ప్​ సీఈఓ దివ్య దేవరాజన్ తో కలిసి జిల్లాల వారీగా గత నెల రోజులపాటు మహిళా సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్న ‘పూరెస్ట్ ఆఫ్ ద పూర్’ ను టార్గెట్‌‌‌‌గా గుర్తించి, వారిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ఇప్పటివరకు అందని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘మీ పరిసరాల్లో, మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి, వారికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియజేస్తే ప్రభుత్వం తప్పకుండా వారిని ఆదుకుంటుంది’అని పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన ప్రొఫార్మాను త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​లుగా ఎన్నికైన సూర్యాపేట, వనపర్తి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, స్వరూపను మంత్రి సీతక్క సన్మానించారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్న  సెర్ప్​ను అభినందించారు. 

పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మైక్రోప్లాన్​.. 

కేరళలో అత్యంత పేదరిక నిర్మూలన ఎలా చేపట్టారో మహిళా సంఘాలకు మంత్రి సీతక్క వివరించారు. అక్కడ సర్వే ద్వారా 64,006 అత్యంత పేద కుటుంబాల్లో సుమారు లక్ష మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నవారిగా గుర్తించారన్నారు. 

ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి, గృహ నిర్మాణం వంటి అంశాలను ఆధారంగా తీసుకొని బతుకు కష్టంగా ఉన్న కుటుంబాలను అత్యంత పేదలుగా గుర్తించి, ప్రతి కుటుంబానికి ఉన్న వేర్వేరు అవసరాల కోసం ప్రత్యేక మైక్రో ప్లాన్‌‌‌‌ ను రూపొందించారని, అదేవిధంగా తెలంగాణలో కూడా అత్యంత పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మైక్రో ప్లాన్ ను  రూపొందిస్తామని పేర్కొన్నారు.