- నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నరు
- సీఎం రేవంత్‌కు బూతులు తప్ప.. సబ్జెక్ట్ తెల్వదు
- పాత బాస్‌కు కోపం వస్తదనే పాలమూరును పండబెట్టిండని కామెంట్
- అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్సోళ్లే పేల్చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘‘మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి సభలో చెప్పిండు. రష్యాలో కఖోవ్కా డ్యామ్‌ను పేల్చినట్టే ఇక్కడ కూడా పేల్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలోనే చెప్పారు. ఆనాడు ఇంజినీర్లు కూడా మేడిగడ్డను పేల్చారని ఫిర్యాదు చేశారు. మరి దానిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదు? ”అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందో కూడా సీఎం రేవంత్‌రెడ్డికి తెల్వదని, అసలు భాక్రానంగల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందో కూడా తెలియని స్థితిలో ఆయన ఉన్నారని అన్నారు. సబ్జెక్ట్ లేకపోవడం వల్లే సీఎం బూతులు మాట్లాడుతున్నారని, నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేనిమీద చర్చ పెడుతున్నారో తెలియదని, నీటి పారుదలపై ఎలాంటి అవగాహన లేనివారు కేసీఆర్‌ను చర్చకు రావాలని పిలుస్తున్నారన్నారు.
పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే..
తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే.. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టిండని కేటీఆర్ అన్నారు. కనీసం కాలువలు కూడా తవ్వడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టమని, 45 టీఎంసీలకు ఒప్పుకుంటే పాలమూరుకు నష్టం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
శాంతి భద్రతలు, రక్షణ కోసం ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ట్యాప్ చేయడం లేదని సీఎం చెప్పగలరా? అని ప్రశ్నించారు. 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
డబ్బుల కోసమే జీహెచ్ఎంసీ ముక్కలు
డీలిమిటేషన్ పేరుతో అడ్డగోలు విభజన చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. డబ్బుల కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ విభజనపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కేసీఆర్‌ను సభలో కలిసే సంస్కారం ఉన్న సీఎంకు.. బయట మాట్లాడేటప్పుడు కూడా అదే సంస్కారం ఉండాలని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎటూ కాకుండా పోయిందని విమర్శించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
