- అన్నింటిపై అసెంబ్లీలో చర్చిద్దాం.. రెడీగా ఉండండి
- మంత్రులు, విప్లతో సీఎం రేవంత్రెడ్డి
- ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు
- అందుకే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
- కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
- ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేలకూ అర్థమైంది
- ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ పారదర్శకంగా సమాధానం ఇద్దామని సూచన
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి దీటుగా సమాధానం చెప్పాలని, ప్రభుత్వంపై వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులు, విప్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం తన చాంబర్‌లో వారితో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన ఆయన.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో మంత్రులంతా పూర్తిస్థాయి అవగాహనతో సభకు రావాలని, ప్రతిపక్షాల ఆరోపణలకు వాస్తవాలతో చెక్ పెట్టాలని సీఎం సూచించారు.
జనవరి ఫస్ట్‌న అందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై ఆయా జిల్లాల మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు పట్టు సాధించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
సభలో ప్రతిపక్ష సభ్యులు ఏ చిన్న అంశంపై ప్రశ్న అడిగి వివరణ కోరినా.. తడబడకుండా వెంటనే సమాధానం చెప్పేలా సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ మంత్రి మాత్రమే కాకుండా.. ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులందరూ తమ జిల్లాల్లోని ప్రాజెక్టుల స్థితిగతులు, పదేండ్లలో ఏం జరిగిందో పూర్తి డేటాతో సిద్ధంగా ఉంటే, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ తంటాలు
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోందని, అందుకే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగడానికి ప్రధాన కారణం మాజీ సీఎం కేసీఆరేనన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.
ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఫల్యం వల్లే మన నీటి వాటా కోల్పోయామన్న సంగతిని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అర్థం చేసుకున్నారని, ఈ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా ఇరుకున పడుతుందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను ఏమాత్రం ఉపేక్షించకుండా రాజకీయంగానూ దీటుగా ఎదుర్కోవాలన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
సభ జరుగుతున్నంత సేపు మంత్రులందరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతిపక్ష సభ్యుల నుంచి వచ్చే విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సభలో ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ నిబంధనను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతిపక్షం గొంతు పెంచితే అంతకు మించిన స్వరంతో వాస్తవాలను వినిపించాలన్నారు.
కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని.. ఇందుకోసం మంత్రులు, విప్‌లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించించారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయటపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.
