- బాత్రూమ్కు వెళ్లి లేట్‌గా రావడంతో ఓనర్ కోపడతాడని క్రియేట్
- గ్రూపుల్లో సర్క్యూలేట్ కావడంతో జనం భయాందోళన
- కేసు నమోదు చేసిన పోలీసులు
శామీర్ పేట, వెలుగు: చిరుత పులి సంచారిస్తుందని ఏఐ ద్వారా ఫొటో తయారు చేసి ఫేక్ వార్త సృష్టించిన యువకుడిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని పెద్ద చెరువును ఆనుకొని ఉన్న విదర్భ వెంచర్లో బిహార్ రాష్ట్రానికి చెందిన రవీందర్ కుమార్ (18) అనే యువకుడు కూలీ పని చేస్తున్నాడు. పని మధ్యలో బయటకు వెళ్లిన అతను రెండు గంటలు గడుస్తున్నా రాకపోవడంతో మేస్త్రి ఫోన్ చేశాడు. పని వద్దకు వచ్చిన అతన్ని ప్రశ్నించగా, మూత్రం పోయడానికి వెళ్లగా చిరుత పులి కనిపించిందన్నాడు. దాన్ని చూసి భయంతో అక్కడే దాక్కున్నానని చెప్పాడు. మేస్త్రి నమ్మకపోవడంతో ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోను చూపించాడు.
వెంటనే మేస్త్రి ఓనర్‌కు వాట్సాప్‌లో ఫొటో పెట్టి ఫోన్ చేసి చెప్పగా, ఓనర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. ఆ ఫొటోను ఓనర్ అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్‌కు పెట్టగా ఆయన ఎన్నో గ్రూపుల్లో షేర్ చేశాడు. దాన్ని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. రవీందర్‌ను అడగగా పని నుంచి వెళ్లి చాలా సమయం అయ్యింది ఓనర్ కోపడతాడని ఏఐ ద్వారా ఫేక్ ఫొటో సృష్టించానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అబద్ధ ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రవీందర్‌ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని శామీర్‌పేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
