నుమాయిష్ స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై విచారణ చెయ్యాలి..పలువురు స్టాళ్ల నిర్వాహకుల డిమాండ్

నుమాయిష్  స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై విచారణ చెయ్యాలి..పలువురు స్టాళ్ల నిర్వాహకుల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నిర్వహించే​ నుమాయిష్ ​స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి నాయకులతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు సమావేశం నిర్వహించారు. స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ తో కలిసి జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడారు. నుమాయిష్ లో మొత్తం 3 వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే , అధికారిక లెక్కల్లో మాత్రం 2 వేల స్టాల్స్ మాత్రమే  చూపిస్తున్నారని తెలిపారు. 

మిగిలిన స్టాల్స్ ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్ కు లక్ష రూపాయల రెంట్ ఉంటుందని , కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా రెండు నుంచి మూడు లక్షల వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది సొసైటీ కన్వీనర్, ప్రస్తుత స్టాల్స్ అలట్మెంట్ అడ్వైజర్ ప్రభ శంకర్ కనుసన్నల్లోనే అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ఐటీ మంత్రి, సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

పారదర్శకంగానే కేటాయింపు

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని , పారదర్శకంగానే స్టాల్స్ కేటాయింపు జరిగిందని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. అవినీతి జరిగిందంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

గతేడాది స్టాల్స్ కేటాయించిన కొంతమంది , వేరే వాళ్లకు ఎక్కువ డబ్బులకు సబ్ లీజ్ కు ఇచ్చారని అన్నారు. అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి , ఈ ఏడాది స్టాల్స్ కేటాయించలేదని ... దాని వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సొసైటీ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని... ఎలాంటి ఎంక్వైరీ కైనా సిద్ధంగా ఉన్నామన్నారు.